Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదు: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కలం, జనగామ:  గత 12 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించడం లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడమే ప్రధాని నరేంద్ర మోడీకి, బీజేపీకి ఇష్టం లేదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని  విమర్శించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్న కాజీపేట రైల్వే డివిజన్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని, బొగ్గు నిల్వలు, అటవీ సంపద, జల వనరులు, సారవంతమైన భూములు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు.

తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకురావడంలో వారు విఫలమయ్యారని ఆరోపిస్తూ, “తెల్లారిలేస్తే ప్రెస్ మీట్‌లు పెట్టి ప్రభుత్వాన్ని తిట్టడమే పని” అని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులు, నిధులు కేటాయిస్తున్న కేంద్రం, తెలంగాణకు మాత్రం హక్కుగా రావాల్సిన నిధులు తప్ప అదనంగా ఏమీ ఇవ్వడం లేదని ఆయన అన్నారు. బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు తెలంగాణకు వారు ఏం తెచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే డివిజన్‌తో పాటు తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టును వెంటనే ప్రకటించాలని కడియం శ్రీహరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>