కరీంనగర్‌లో ఆర్టీసీ సమ్మెకు డిప్యూటీ మేయర్ సునీల్ రావు మద్దతు

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్‌లో తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం బుధవారం ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె (RTC Workers Strike) కు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (Yadagiri Sunilrao) పూర్తి మద్దతు ప్రకటించారు. గురువారం సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఆయన, కార్మికులతో కలిసి నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు  మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంపై తీవ్ర విమర్శలు చేశారు. కార్మికుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే, బేషరతుగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులకు కనీసం టెంట్ వేసుకునే అనుమతి కూడా ఇవ్వకపోవడం యాజమాన్యపు మొండితనాన్ని సూచిస్తోందని ఆయన విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు బీజేపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వారి పక్షాన నిలుస్తారని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను సునీల్ రావుకు వివరించారు. ముఖ్యంగా మహిళా కార్మికులు తమ కష్టాలను వెల్లడించారు. ‘మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత పని ఒత్తిడి పెరిగి, మా అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది’ అంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, ఇప్పటికైనా మొండివైఖరి వీడి చర్చలు ప్రారంభించాలని సునీల్ రావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు, మహిళలు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also: ఆర్టీసీ సమ్మె వేళ.. సొంత పార్టీపై జగ్గారెడ్డి సెటైర్లు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>