ఇంధన పొదుపే మరో విద్యుత్ కేంద్రం: డిప్యూటీ సీఎం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ హెచ్‌ఐసీసీ నోవాటెల్ హోటల్‌లో జరిగిన సీఐఐ (CII) – ఎనర్జీ ఎఫిషియెన్సీ కౌన్సిల్ 25వ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్-2026’ వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక ప్రసంగం చేశారు. దశాబ్దన్నర కాలంగా హైదరాబాద్ వేదికగా సాగుతున్న ఈ సమ్మిట్ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. ఇంధన సామర్థ్యంతో ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండూ సాధించవచ్చని, స్థిరమైన అభివృద్ధికి ఇది అత్యంత ఆచరణాత్మక మార్గమని స్పష్టం చేశారు.

విద్యుత్ ఉత్పత్తితో పాటు పొదుపుపై ప్రత్యేక దృష్టి సారించాలని, మనం ఉత్పత్తి చేసే విద్యుత్ కంటే పొదుపు చేసే ప్రతి యూనిట్ చౌకైనదని, అది మరొక విద్యుత్ కేంద్రంతో సమానమని పేర్కొన్నారు. ఇంధన సామర్థ్యాన్ని కేవలం పర్యావరణ బాధ్యతగా కాకుండా, ఆర్థిక పోటీతత్వాన్ని పెంచే వ్యూహంగా చూడాలని పిలుపునిచ్చారు. మెరుగైన మోటార్లు, శీతలీకరణ వ్యవస్థలు, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ ద్వారా విద్యుత్ వృథాను అరికట్టవచ్చన్నారు. ప్రతి మెగావాట్ డిమాండ్ తగ్గడం వల్ల విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని, పరిశ్రమలకు నిర్వహణ వ్యయం కూడా తగ్గుతుందని వివరించారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో పరిశ్రమలు, తయారీ, డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ రంగాల విస్తరణ వల్ల విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతోందన్నారు. అయితే అభివృద్ధి వేగాన్ని తగ్గించడం పరిష్కారం కాదని, ప్రతి యూనిట్ విద్యుత్‌తో గరిష్ఠ ఆర్థిక కార్యకలాపాలు సాధించాలని సూచించారు. పునరుత్పాదక ఇంధనం, విద్యుదీకరణ, డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతలతో విద్యుత్ వృథాను అరికట్టి వినియోగాన్ని క్రమబద్ధీకరించవచ్చని తెలిపారు. ఒక పరిశ్రమలో విజయవంతమైన సాంకేతికతను వందలాది పరిశ్రమలకు వేగంగా విస్తరించడమే ప్రధాన సవాలని, పరిశ్రమలు కేవలం వినియోగదారులుగా కాకుండా విద్యుత్ వ్యవస్థలో చురుకైన భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, పటిష్టమైన శాంతిభద్రతలు, అనుకూల వాతావరణం కలిగిన తెలంగాణ పారిశ్రామికవేత్తలకు అత్యంత స్నేహపూర్వక రాష్ట్రమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వం పెట్టుబడిదారులను సంపద సృష్టికర్తలుగా భావిస్తోందని, వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. చిన్న రాష్ట్రమైనప్పటికీ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడమే తెలంగాణ లక్ష్యమని, దీనికి అనుగుణంగా విద్యుత్ సహా అన్ని కీలక రంగాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>