కలం, కరీంనగర్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన, పోషకాలతో కూడిన అల్పాహారాన్ని అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో సుమారు రూ. 8 కోట్ల వ్యయంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నూతనంగా నిర్మించిన ‘సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్’ను మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) తో కలిసి బుధవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కిచెన్ లోని ఇడ్లీ, దోశ, పూరీ, బోండా తయారీ మిషన్లు, వెజిటబుల్ కట్టింగ్, ఆటోమేటిక్‌గా పాత్రలు శుభ్రం చేసే యంత్రాలు, పాల కేంద్రం, ఆహార భద్రతా టెస్టింగ్ ల్యాబ్‌లను పరిశీలించి వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి, వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
49,025 మందికి ప్రయోజనం:
ఈ కేంద్రీకృత వంటశాల ద్వారా కరీంనగర్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలలోని 17 మండలాలకు చెందిన 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 జూనియర్ కళాశాలల్లోని మొత్తం 49,025 మంది విద్యార్థులకు ప్రతిరోజూ ఉచితంగా అల్పాహారం అందుతుంది.
రాష్ట్రంలో 6వ కిచెన్:
హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 6వ కమ్యూనిటీ కిచెన్ ఇది.
బోధనపైనే టీచర్ల దృష్టి:
గతంలో కొడంగల్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ కార్యక్రమంతో విద్యార్థుల హాజరు శాతం 75% నుండి 90%కి పెరిగింది. వంట నిర్వహణ బాధ్యతల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి లభించడంతో వారు పూర్తిగా బోధనపైనే దృష్టి సారిస్తారు.
మెనూ వివరాలు (NIN శాస్త్రవేత్తల సూచనలతో):
సోమవారం: ఇడ్లీ – సాంబార్
మంగళవారం: పూరీ – ఆలూ కుర్మా
బుధవారం: దోశ – చట్నీ
గురువారం: ఉప్మా – చట్నీ
శుక్రవారం: మిల్లెట్ ఇడ్లీ – సాంబార్
శనివారం: బోండా – చట్నీ
(గమనిక: రోజు విడిచి రోజు విద్యార్థులకు పాలు పంపిణీ చేయబడతాయి)
రాష్ట్రస్థాయి బృహత్ ప్రణాళిక
రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో రూ. 245 కోట్ల వ్యయంతో 31 మెగా కిచెన్లను ఏర్పాటు చేసి, 23,106 పాఠశాలల్లోని 17.72 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని మంత్రి తెలిపారు. థర్మల్ ఇన్సులేటెడ్ వాహనాల ద్వారా వేడివేడిగా, పరిశుభ్రంగా అల్పాహారాన్ని పాఠశాలలకు తరలిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, హరే కృష్ణ మూవ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌంటియా దాస స్వామీజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

