కలం, ఖమ్మం బ్యూరో: “రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కేవలం సిమెంట్, ఇటుకల భవనాలు కావు.. అవి రేపటి తరాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దే దార్శనిక దేవాలయాలు” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అభివర్ణించారు. విద్యారంగానికి ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యతనిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్లు మండలం లక్ష్మీపురం (Lakshmipuram)లో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తీవ్ర ఎండను సైతం లెక్కచేయకుండా పాఠశాల ఆవరణ అంతటా కాలి నడకన తిరుగుతూ, పనుల పురోగతిని స్వయంగా అంచనా వేశారు.
విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే మెకానికల్, సైన్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ల్యాబ్ భవనాల నిర్మాణ నాణ్యతపై అధికారులకు డిప్యూటీ సీఎం కీలక సూచనలు చేశారు. జూనియర్ హాస్టల్, జూనియర్, సీనియర్ విభాగాలు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ నిర్మాణ ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా, నిబంధనల ప్రకారం అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. పనులను మరింత వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు ఈ విద్యా మందిరాన్ని అందుబాటులోకి తీసుకురావాలని గుత్తేదారులకు డిప్యూటీ సీఎం స్పష్టమైన గడువు విధించారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

