కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధానిలో విషాదకరమైన ఘటన వెలుగుచూసింది. ఢిల్లీ (Delhi)లోని అమర్ కాలనీలో నివసించే ఓ ఐఆర్ఎస్ అధికారి 22 ఏళ్ల కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడి, ఆపై ఛార్జర్ కేబుల్‌తో గొంతు నులిమి హత్య చేసిన ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని రాజస్థాన్‌కు చెందిన రాహుల్ మీనా (19)గా పోలీసులు గుర్తించారు.
బుధవారం ఉదయం తల్లిదండ్రులు వాకింగ్‌కు వెళ్లి తిరిగి వచ్చేసరికి, తమ కుమార్తె అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అధికారులకు నిందితుడు హత్య తర్వాత దుస్తులు మార్చుకుని పరారవుతున్న దృశ్యాలు లభించాయి. దీని ఆధారంగా నిందితుడి ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు రాహుల్ మీనా గతంలో సదరు ఐఆర్ఎస్ అధికారి ఇంట్లోనే పనిచేసేవాడు. అయితే ఇంట్లో డబ్బులు దొంగిలిస్తూ పట్టుబడటంతో నెల రోజుల క్రితమే అతడిని పనిలో నుంచి తొలగించారు. ఈ క్రమంలో యజమానులపై పెంచుకున్న కక్షతోనే అతడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి ఢిల్లీ (Delhi)కి రాకముందు రాజస్థాన్‌లోని తన స్వగ్రామంలో కూడా ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

