కలం, వెబ్ డెస్క్: నరాలు తెగే ఉత్కంఠ.. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం.. వెరసి ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తమ సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. జైపూర్ వీరులు విసిరిన 194 పరుగుల భారీ టార్గెట్‌ను అక్సర్ పటేల్ బ్రిగేడ్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఊహించని రీతిలో ఊడ్చేసింది. ఒకవైపు ఒత్తిడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నా, ఆఖర్లో అశుతోష్ శర్మ సిక్సర్ల సునామీతో ఢిల్లీకి మరపురాని విజయాన్ని అందించాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (12 పరుగులు, 9 బంతులు, 3 ఫోర్లు) నిరాశపరిచాడు. అయితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.
కేవలం 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఆ తర్వాత ధ్రువ్ జురేల్ (53 పరుగులు, 40 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రియాన్ పరాగ్ (51 పరుగులు, 26 బంతులు, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగిపోవడంతో రాజస్థాన్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 14 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 161 పరుగులతో భారీ స్కోరు వైపు దూసుకెళ్లిన రాజస్థాన్‌కు ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ షాక్ ఇచ్చింది. డోనోవన్ ఫెరీరా (0), రవి సింగ్ (4), శుభమ్ దూబే (5), దాసున్ శనక (10) వరుసగా అవుటయ్యారు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్ (2 నాటౌట్), ఆడమ్ మెల్నీ (2 నాటౌట్) క్రీజులో నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో మిచేల్ స్టార్క్ 4 వికెట్లతో చెలరేగగా, లూంగి ఎన్గిడి, మాధవ్ తివారీ చెరో 2 వికెట్లు తీశారు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు అభిషేక్ పోరెల్, కెఎల్ రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు ఏకంగా 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను చేతుల్లోకి తీసుకున్నారు.
అభిషేక్ పోరెల్ 31 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేయగా, రాహుల్ 42 బంతుల్లో ఒక ఫోర్, 3 సిక్సర్లతో 56 పరుగులు సాధించి అవుటయ్యారు. అయితే ఈ ఇద్దరు అవుటైన తర్వాత సాహిల్ పరాఖ్ (9), ట్రిస్టన్ స్టబ్స్ (4), డేవిడ్ మిల్లర్ (9) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆ దశలో కెప్టెన్ అక్సర్ పటేల్ (34 నాటౌట్, 18 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్ నడిపించాడు. ఆఖర్లో వచ్చిన అశుతోష్ శర్మ కేవలం 5 బంతుల్లోనే ఒక ఫోర్, 2 బద్దలుకొట్టే సిక్సర్లతో 18 పరుగులు చేసి సునామీ సృష్టించాడు. దీంతో ఢిల్లీ 19.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేష్ శర్మ చెరో 2 వికెట్లు తీయగా, దాసున్ శనకకు ఒక వికెట్ దక్కింది.

