కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో త్వరలోనే మిడ్ వైఫరి ట్రైనింగ్ (Midwifery Training) ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha) స్పష్టం చేశారు. సిజేరియన్ డెలివరీలను తగ్గించి.. నార్మల్ డెలివరీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బోయగూడలోని మిడ్‌వైఫరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన సేఫ్ మదర్ హుడ్ డే వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. మాతృత్వం ఒక అందమైన ప్రయాణమని.. మహిళలకు ఒక గొప్ప వరం అని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో మహిళలకు అండగా ఉండి, సురక్షితమైన, గౌరవప్రదమైన వైద్య సేవలు అందించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలు.. ముఖ్యంగా గర్భిణుల ఆరోగ్యం అంటే శిశు ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, సమాజ అభివృద్ధికి పునాది అని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు.
లక్షలాది మంది గర్భిణులకు సమగ్ర వైద్య సేవలు..
తెలంగాణలో సంవత్సరానికి లక్షలాది మంది గర్భిణులకు ప్రభుత్వ హాస్పిటళ్లలో సమగ్ర వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి (Damodar Rajanarsimha) ప్రకటించారు. ప్రతి గర్భిణీకి ఉచితంగా యాంటీనేటల్ చెకప్‌లు, స్కానింగ్‌లు, అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నామని చెప్పారు. రక్తహీనత నివారణ కోసం ఐఎఫ్ఏ మాత్రలు, కాల్షియం సరఫరా, అవసరమైన వారికి ఐరన్ ఇంజెక్షన్లు అందిస్తున్నామని వివరించారు. ప్రతి గర్భిణీకి సమయానికి పరీక్షలు, పోషకాహారం, సలహాలు అందేలా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి, ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 102 వాహనాల్లో ఉచితంగా గర్భిణులను ఇంటి నుంచి హాస్పిటల్స్‌కు, తిరిగి ఇంటికి పంపిస్తున్నామని చెప్పారు. “అనీమియా ముక్త భారత్” కార్యక్రమంలో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. “ఆరోగ్య మహిళ” కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక సేవలు అందిస్తున్నామని వివరించారు.
మహిళలకు ఉచితంగా 30 రకాల వైద్య పరీక్షలు..
రాష్ట్రంలోని 46 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా 30 రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో సర్వైకల్ కేన్సర్‌ను అరికట్టేందుకు బాలికలకు HPV వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు మిడ్‌వైఫరీ సేవలను రాష్ట్రంలో బలోపేతం చేస్తున్నామని చెప్పారు. 370 మంది నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇప్పించామని తెలిపారు. ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఏర్పాటు చేస్తామని.. సిజేరియన్ డెలివరీలు తగ్గించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో నర్సింగ్ ఆఫీసర్ల నియామకానికి (Nursing Officers Recruitment) అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. గత రెండేళ్లలో సుమారు 10 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేశామని.. ఇందులో నర్సింగ్ పోస్టులే అధికంగా ఉన్నాయన్నారు. మరో రెండ్రోజుల్లో ఇంకో 2322 నర్సింగ్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని చెప్పారు. కొత్త నర్సింగ్ కాలేజీలు స్థాపించి, విద్యార్థులకు అవకాశాలు పెంచుతున్నామని తెలిపారు.
Read Also: హై టెన్షన్.. ప్రయాణికులను మళ్లీ ఇబ్బందిపెట్టిన ఇండిగో!
Follow Us On: X(Twitter)

