కలం, నిర్మల్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఆందోళనకు పిలుపునిచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులను (AAP Leaders) నిర్మల్ జిల్లా కేంద్రంలో పోలీసులు సోమవారం ముందస్తుగా అరెస్టు చేశారు. రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల తరఫున 17 ప్రశ్నలు అడిగినందుకే ముందస్తు అరెస్టులకు దిగడం ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడమేనని విమర్శించారు.
తెలంగాణకు రావాల్సిన నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుల కరువు సమస్యలు, పెట్రోల్ ధరలు, నిరుద్యోగం, మహిళల భద్రత, ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్టులతో తమ నిరసన గళాన్ని అడ్డుకోలేరని, ప్రధాని అయినా, హోంమంత్రి అయినా ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆప్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో జిల్లా జనరల్ సెక్రటరీ సీహెచ్ వినోద్, ట్రెజరర్ అబ్దుల్ సాధిక్ ఉన్నారు.

