కలం, వెబ్ డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్'(Cyclone Akvan) తీవ్ర తుపాన్‌గా బలపడి ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం సమయానికి నెల్లూరు-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్టంగా 145 కిలోమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తుపాన్ ప్రభావంతో 19, 20వ తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అక్వాన్ తుపాన్ ప్రభావంతో గురు, శుక్ర వారాల్లో తెలంగాణలోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది.

