కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీసుల వ్యవహారంపై హైకోర్టు (Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఎఫ్ఐఆర్ లు నమోదు చేయకుండానే, సివిల్ డ్రెస్ లో సోదాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హోం శాఖ, డీజీపీ, హైదరాబాద్ సీపీలతో పాటు టాస్క్ ఫోర్స్ డీసీపీలకు నోటీసులు ఇచ్చింది.
నిబంధనలకు విరుద్ధంగా సోదాలు చేస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై జస్టిస్ టి. మాధవీ దేవి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే పోలీసులు సోదాలు నిర్వహించడం నిబంధనలకు వ్యతిరేకమని వాదించారు. అంతేకాకుండా, సోదాల కోసం వారెంట్లు జారీ చేసే అధికారం మేజిస్ట్రేట్‌లకు మాత్రమే ఉంటుందని, ఏసీపీలు వారెంట్లు జారీ చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.
వివరణ ఇవ్వాలని ఆదేశం
పటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం (Telangana High Court) రాష్ట్ర హోంశాఖ, డీజీపీ, హైదరాబాద్ సీపీ పోలీస్ కమిషనర్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తమ వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. కాగా, హైకోర్టు నోటీసులతో తెలంగాణ పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.

