కలం, వెబ్ డెస్క్: సైబర్స్ స్కామ్స్ (Cyber Scam), సోషల్ మీడియా మోసాలపై పోలీసులు, సంబంధిత అధికారులు అవగాహన కల్పిస్తున్నా అడ్డుకట్ట పడటం లేదు. ఇటీవల ఓ సైబర్ నేరస్తుడు ఇన్స్టాలో ‘25 August 2026’ పేరిట ఓ ఖాతా తెరిచాడు. ఆగస్టు 25న ‘ఓ పెద్ద రహస్యం ఉండబోతుంది’ అంటూ వరుసగా రీల్స్ చేసి పోస్ట్ చేశాడు. ఆ రీల్స్ ఆసక్తిగా, ఉత్కంఠగా ఉండటంతో చాలామంది ఫాలో అయ్యారు. ఆ సీక్రెట్ తెలియాలంటే.. తన టెలిగ్రామ్ ఛానల్లోకి రావాలంటూ ఆహ్వానించాడు. అయితే ఆ స్పెషల్ వీడియో చూసేందుకు.. ఒక్కొక్కరి నుంచి రూ.500 వసూలు చేశాడు.
ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు 1.66 లక్షల మంది రూ.500 చొప్పున చెల్లించడంతో రూ. 8.5 కోట్ల రూపాయల దాకా వచ్చాయి. తీరా ఆగస్టు 25న ఆ వీడియో రివీల్ చేయగా.. అందరు షాక్ అయ్యారు. అతను చెప్పినట్లు ఆ వీడియోలో ఎలాంటి ‘బిగ్ రివీల్’ లేకపోవడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు.
అయితే టెలిగ్రామ్లో రూపంలో డబ్బులు ఇవ్వడంతో ఆ నేరగాడ్ని గుర్తించడం కష్టంగా మారింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ‘ఈ సైబర్ నేరగాడు మామూలోడు కాదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఏవిధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.

