కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి (Konda Murali) తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒక బిల్లు సంబంధించి మాట్లాడేందుకే తాను భట్టి విక్రమార్కను కలిశానని తెలిపారు. డిప్యూటీ సీఎంతో భేటీ సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడ ఉన్నప్పటికీ, ఆయనతో తాను ఎలాంటి చర్చలూ జరపలేదని చెప్పారు. రాజగోపాల్ రెడ్డితో భేటీకి ఎలాంటి సంబంధమూ లేదని, తానె వెళ్ళినప్పుడు మాట్లాడింది కేవలం తన బిడ్డ ఇష్యూ గురించేనని స్పష్టం చేశారు.
అలాగే పీసీసీ క్రమశిక్షణా కమిటీకి చెప్పాల్సిన విషయాలు చెప్పామని, నివేదికపై ప్రస్తుతం ఏమీ మాట్లాడనని పేర్కొన్నారు. ఆ నివేదికపై ఏం నిర్ణయం తీసుకుంటారో తనకు గానీ, తన బిడ్డకు గానీ తెలియదని చెప్పారు. ఎవరి వాదన వారికుంటుందని, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని వ్యాఖ్యానించారు.
సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని మురళి వ్యాఖ్యానించారు. ఆమె అభిప్రాయాలు ఆమెకున్నాయని, ఏ వ్యాఖ్యలు చేయాలో నిర్ణయించుకునే స్వతంత్రత ఆమెకు ఉందన్నారు. సుష్మిత వయసు 38 ఏండ్లని, ఆమెకు 15 ఏండ్ల కొడుకు ఉన్నాడని, అతడు వరల్డ్ ఛాంపియన్‌గా ఉన్నాడని గుర్తుచేశారు. ఆమె మనోభావాలు ఆమెకున్నాయని, ఆమెను ప్రశ్నించే హక్కు కూడా తమకు లేదని పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, నిన్న కూడా ఆమె అధికారికంగా జరిగిన వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నదని వెల్లడించారు. తన బిడ్డ తన కుటుంబ సభ్యురాలు అయినప్పుడు ఆమెతో ఏం సంబంధం అని ఎవరైనా అడుగుతారా అని ప్రశ్నించారు.
పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాలను కొండా మురళి ఖండించారు. తానుగానీ, కొండా సురేఖగానీ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.

