కలం, ఖమ్మం బ్యూరో : పంట అవశేషాలను (Crop Residue) బహిరంగంగా కాల్చడం చట్టవిరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడితే భారీ జరిమానాలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు హెచ్చరించారు. నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామ పంచాయతీ పరిధిలో వరి కొయ్యలను కాల్చిన రైతు బి. కృష్ణారావుకు రూ.5 వేల జరిమానా విధించినట్లు అధికారులు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
పంట కోత అనంతరం వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి తదితర అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం పెరగడమే కాకుండా భూమిలోని సేంద్రియ పదార్థాలు, సూక్ష్మజీవులు నశించి భూసారం దెబ్బతింటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తదుపరి పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు (జి.ఓ.ఎం.ఎస్. నెం.27) ప్రకారం బహిరంగ ప్రదేశాలలో పంట అవశేషాల దహనం పూర్తిగా నిషేధించబడిందని స్పష్టం చేశారు. ఈ నిబంధనల ప్రకారం సాధారణ ఉల్లంఘనలకు రూ.5 వేలు, భారీ స్థాయిలో తగులబెడితే రూ.25 వేల వరకు పర్యావరణ పరిహారం విధించే అధికారం గ్రామ పంచాయతీలకు ఉందని తెలిపారు.
రైతులు పంట అవశేషాలను కాల్చకుండా కంపోస్టు, వర్మీ కంపోస్టు తయారీకి లేదా ఇంధనంగా వినియోగించే ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, భూసార సంరక్షణ కోసం ప్రతి రైతు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

