నా కన్నా బెటర్ ఎవరూ లేరు: రొనాల్డో

కలం, స్పోర్ట్స్ : ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడిని (GOAT Statement) నేనేనని పోర్చుగల్‌ స్టార్‌ స్ట్రైకర్‌ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రదర్శనలకు, గోల్స్‌ సాధనకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎన్‌ఎన్‌ పోర్చుగల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ టీజర్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన ఆటతీరును, గోల్స్‌ను అభిమానులు సరిగ్గా అంచనా వేయడం లేదని రొనాల్డో అన్నారు. తాను వెయ్యి గోల్స్‌కు చేరుకుంటానా లేదా అనేది ముఖ్యం కాదని, మైదానంలో సహజంగా ఆడుతూ ముందుకు సాగాలని పేర్కొన్నారు.

తాను 920, 925 లేదా 930 గోల్స్‌ సాధించినా.. ఫుట్‌బాల్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిని తానేనని, ఇందులో ఎలాంటి చర్చకూ తావులేదని స్పష్టం చేశారు. కేవలం లెక్కలు, గణాంకాల ఆధారంగానే తన ప్రతిభను అంచనా వేయలేమని అభిప్రాయపడ్డారు.భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించనని, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ వర్తమానంలో జీవిస్తానని రొనాల్డో వెల్లడించారు. ఒకరోజు ఉదయం నిద్రలేచినప్పుడు ఫుట్‌బాల్‌ ఆడాలనే ఉత్సాహం లేకపోతే ఆటకు వీడ్కోలు పలుకుతానని, అంతేతప్ప సుదీర్ఘకాలం గురించి ముందుగానే ప్రణాళికలు వేసుకోనని తెలిపారు.

రొనాల్డో వ్యాఖ్యలతో ఆయనకు, అర్జెంటీనా స్టార్‌ లయోనెల్‌ మెస్సీకి మధ్య ఎవరు గొప్ప ఆటగాడనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. 2022 ఫిఫా ప్రపంచకప్‌ను గెలుచుకున్న మెస్సీ.. తన కెరీర్‌లో మరో కీలక ఘనతను సాధించగా, రొనాల్డో తన గోల్స్‌ రికార్డులతో ప్రత్యేక గుర్తింపు పొందారు. గతంలోనూ రొనాల్డో తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 2022లో పియర్స్‌ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆ పరిణామాల అనంతరం క్లబ్‌ ఆయనతో కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంది. తాజాగా రొనాల్డో చేసిన వ్యాఖ్యలు ఫుట్‌బాల్‌ అభిమానుల్లో మరోసారి చర్చకు దారితీశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>