కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం శ్రీనివాస్ నగర్లో గత 50 ఏళ్లుగా పక్కా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు మున్సిపల్ అధికారులు ఇళ్ల తొలగింపు నోటీసులు జారీ చేయడంపై సీపీఎం (CPM) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “యాభై ఏళ్లుగా లేని ఆక్రమణ అధికారులకు ఇప్పుడు గుర్తొచ్చిందా?” అని నిలదీస్తూ, నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట బాధితులతో కలిసి నిర్వహించిన భారీ ధర్నాలో ఆయన మాట్లాడారు.
ఇన్నాళ్లూ ప్రభుత్వ పట్టాలు కలిగి ఉండి, క్రమం తప్పకుండా మున్సిపల్ టాక్స్లు, విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న పేదలపై 15 రోజుల్లో ఖాళీ చేయాలంటూ అధికారులు ప్రతాపం చూపడం దారుణమన్నారు. రోడ్డు విస్తరణ పేరుతో పేదలను వెళ్లగొట్టి భూముల విలువ పెంచుకోవాలని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుట్రలు పన్నుతున్నారని నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తక్షణమే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఈ పోరాటం మరో ‘వెలుగుమట్ల’ సంఘటనలా తీవ్రరూపం దాలుస్తుందని హెచ్చరించారు.
అలాగే నివాస ప్రాంతంలో ఉన్న టింబర్ డిపోల వల్ల తీవ్ర దుమ్ము, ధూళి వ్యాపించి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, సమీపంలో పాఠశాలలు, ఆలయం ఉన్నందున ఆ చిన్న తరహా పరిశ్రమలను వెంటనే నగరం వెలుపలికి తరలించాలని డిమాండ్ చేశారు. బాధితులకు సీపీఎం అండగా ఉంటుందని భరోసా ఇస్తూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వై.విక్రమ్, యర్రా శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.

