తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది: ఎం. బాల నరసింహ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దొరల దోపిడీ, వెట్టిచాకిరీ, భూస్వామ్య పెత్తనానికి వ్యతిరేకంగా సాగిన మహత్తర ప్రజా ఉద్యమమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాల నరసింహ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మంగళవారం నాడు స్థానిక సీపీఐ పార్టీ జిల్లా (Mahabubnagar) కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంతో బీజేపీ గానీ, వారి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ గాని ఎలాంటి సంబంధం లేదని.. కానీ చరిత్రలేని రాజకీయ పార్టీ అయిన బీజేపీ ఆ మహోత్తర పోరాటాన్ని వక్రీకరిస్తూ హిందూ, ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తూ నేటి సమాజాన్ని తప్పు దోవ పట్టిస్తుందని ఆయన అన్నారు.

హిందూ, ముస్లిం పోరాటమే అయితే ఆనాడు నిజం సర్కారులో బందగి సోయబుల్లాఖాన్ ను ఎట్లా చంపుతాడని బాల నరసింహ ప్రశ్నించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన ముగ్దుం మోహినుద్దీన్ ప్రజల పక్షాన నిజాంకు వ్యతిరేకంగా ఎలా పోరాడుతారని ఇందుకు బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతోనే నిజం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేసినట్లయితే వారికి రాజ్ ప్రముఖ హోదా గౌరవ పారితోషకం ఇవన్నీ ఎందుకు ఇచ్చారో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని బీజేపీకి డిమాండ్ చేశారు.

సైనిక చర్యతో లొంగిపోతే నిజాంను జైల్లో పెట్టి భారత యూనియన్ విజయం సాధించిందని చెప్పాలన్నారు. ఇక్కడ కమ్యూనిస్టులు నిర్వహించిన సాయుధ పోరాటం ద్వారానే నిజాం తన సంస్థానాన్ని భారత్ యూనియన్లో విలీనం చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆనాటి కమ్యూనిస్టులు పోరాటం చేయకుంటే ఈనాడు హైదరాబాద్ రాష్ట్రం నిజాం వారసుల చేతుల్లో ఉండేదని జోస్యం చెప్పారు. ఆనాటి సాయిధ పోరాటంలో పాల్గొన్న వారిని స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించాలని కేంద్రంలో ఉన్న వాజ్ పేయి ప్రభుత్వాన్ని అడిగితే వారిని గుర్తించకుండా మొండి చేయి చూపిందని అన్నారు.

ఇప్పటికైనా సాయుధ పోరాటం పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలను గుర్తించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినంగా జరుపుతామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత జరపకుండా తత్చారం చేస్తుందని దుయ్యబెట్టారు. సాయుధ పోరాటాన్ని అధికారికంగా నిర్వహించాలి , పాఠ్యాంశాలలో సాయుధ పోరాట చరిత్రను చేర్చాలని బాల నరసింహ డిమాండ్ చేశారు.

నాటి నిజాం నిరంకుశ పాలనలో పేద రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొన్న దోపిడీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ప్రజలను చైతన్యపరిచి, గ్రామ గ్రామాన రైతులను సంఘటితం చేసి పోరాటాలకు నాయకత్వం వహించిందన్నారు. వెట్టి చాకిరీ, అక్రమ పన్నులు, భూముల ఆక్రమణలు, దొరల పెత్తనానికి వ్యతిరేకంగా “భూమి కోసం – భుక్తి కోసం – విముక్తి కోసం” సాగిన పోరాటంలో వేలాది మంది రైతులు, కూలీలు, మహిళలు పాల్గొన్నారని తెలిపారు. చాకలి ఐలమ్మ వంటి వీర మహిళలు దోపిడీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని బాల నరసింహ అన్నారు. ఈ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు, రైతులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను నేటి తరానికి తెలియజేయడంతో పాటు, ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి బి .బాలకిషన్, జిల్లా మాజీ కార్యదర్శి పరమేష్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు డి. రాము, మహిళ పట్టణ కార్యదర్శి ఇందిరా, జిల్లా కౌన్సిల్ సభ్యులు సత్యనారాయణ రెడ్డి, మహేష్, ఖలీల్, ఆంజనేయులు , ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, లక్ష్మణ్, నాయకులు సుందర్ రాజ్, విగ్నేష్ , శ్రీను పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>