సెప్టెంబర్ 17 చరిత్రను వక్రీకరించొద్దు: చాడ వెంకటరెడ్డి

కలం, కరీంనగర్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అన్ని గ్రామపంచాయతీల్లో జాతీయ జెండాలు ఎగురవేసేలా చర్యలు తీసుకోవాలని సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) డిమాండ్ చేశారు. అమరవీరుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు సాయుధ పోరాట స్మృతివనం ఏర్పాటు చేయాలని కోరారు. సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కరీంనగర్ కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్ రావు విగ్రహానికి చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్‌తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం, నిజాం-రజాకార్ల ఆగడాలను ఎదుర్కొనేందుకు 1947 సెప్టెంబర్ 11న ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మక్దూమ్ మొహియుద్దీన్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని తెలిపారు. ఆ పిలుపుతో తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం జరిగిందన్నారు. కమ్యూనిస్టుల పోరాటం ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైందని తెలిపారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించేందుకు బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తోందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ పోరాటంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. సాయుధ పోరాటాన్ని కేవలం హిందూ-ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తే చరిత్రను వక్రీకరించినట్లేనని అన్నారు. గతంలో అనేక ప్రభుత్వాలు సాయుధ పోరాటాన్ని కీర్తించినప్పటికీ, అధికారికంగా పోరాట వారోత్సవాలను నిర్వహించకపోవడం విచారకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సాయుధ పోరాట స్మృతివనం ఏర్పాటు చేయాలని కోరారు. అమరవీరుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, సాయుధ పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.

అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాలు ఎగురవేసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న అనభేరి ప్రభాకర్ రావు విగ్రహం చుట్టూ, కోతిరాంపూర్ బైపాస్ రోడ్డులోని కరీంనగర్ తొలి పార్లమెంట్ సభ్యుడు బద్దం ఎల్లారెడ్డి విగ్రహం పరిసరాల్లో సుందరీకరణ చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం, నగరపాలక సంస్థపై ఉందని చాడ వెంకటరెడ్డి అన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమళ్ల సమ్మయ్య, బోయిని తిరుపతి, న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు బండ రాజిరెడ్డి, పైడిపెల్లి రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, బీర్ల పద్మ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>