కలం, కరీంనగర్: కరీంనగర్ నగరంలోని డంపింగ్ యార్డ్ (Karimnagar Dumping Yard)లొ చెత్తను తొలగించడానికి గత ప్రభుత్వ హయాంలో అప్పటి మేయర్, రాష్ట్ర మంత్రి డంప్ యార్డ్ సమస్య పరిష్కారానికై రూ. 16 కోట్లతో టెండర్లు పిలిచి మిషనరీని తెప్పిచ్చి వారం రోజులు గడవకముందే దాన్ని మూసివేసారని సీపీఐ (CPI) జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు దుయ్యబట్టారు. అట్టి రూ.16 కోట్లు ఏమైపోయాయో ప్రభుత్వం, అధికారులు విచారణ జరిపించి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డ్ బయో మైనింగ్ కోసం 17.5 కోట్లతో టెండర్లు పిలవడానికి స్వాగతిస్తున్నామని పైడిపల్లి రాజు పేర్కొన్నారు. గతంలో జరిగిన అవకతవకలపై నిధుల దుర్వినిగంపై చర్యలు చేపట్టాలని, గత బీఆర్ఎస్ పాలనలో 16 కోట్లతో రెండు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయోమైనింగ్ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. డంపింగ్ యార్డులో చెత్త దహనంతో వచ్చే కాలుష్యంతో ప్రజలు అనారోగ్యాల పాలవుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కొత్తగా చేపట్టే బయో మైనింగ్ పనులు కేవలం టెండర్లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పూర్తి చేయాలని ఆయన కోరారు. నిధులు దుర్వినియోగం కాకుండా పనులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ చేయాలని, డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని పైడిపల్లి రాజు ప్రభుత్వాన్ని కోరారు.

