కలం, కరీంనగర్: బీజేపీ పాలనలో భారత రాజ్యాంగానికి పెను ప్రమాదం పొంచి ఉందని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి ప్రథమ కర్తవ్యమని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నవంబర్ 26ను పురస్కరించుకొని సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం (Constitution Protection Day) నిర్వహించారు. ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఐ నాయకులు రాజ్యాంగ పీఠికను చేతబట్టి ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఉండాలనే సంకల్పంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని తెలిపారు. నవంబర్ 26, 1956న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును దేశమంతా వేడుకగా జరుపుకోవాల్సి ఉండగా, ప్రస్తుత బీజేపీ పాలనలో రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా పాటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగం కల్పించిన పౌరుల హక్కులు, చట్టాలు, ప్రజాస్వామ్య విలువలను బీజేపీ ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. చివరకు పౌరుల ప్రాథమిక హక్కైన ఓటు హక్కును కూడా తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం అందించిన మానవ హక్కులు, బాధ్యతలు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి పౌరుడు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కొట్టె అంజలి, మచ్చ రమేష్, బామండ్లపల్లి యుగేందర్, బోనగిరి మహేందర్, సాయవేణి రాయమల్లు, బాకం ఆంజనేయులు, కేంసారం శ్రీనివాస్, అల్లేపు రాజు, తంగెళ్ల సంపత్, ఎలిశెట్టి భారతి, చెంచల మురళి, కసిబోజుల సంతోష్ చారి, కాల్వ శ్రీనివాస్, మల్లయ్య, కూన రవి తదితరులు పాల్గొన్నారు.

