కరీంనగర్ రూరల్ మండలానికి చొక్కారావు పేరు పెట్టాలి: CPI

కలం, కరీంనగర్: తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని పేదల కోసం పోరాటాలు నిర్వహించిన చామనపల్లి చొక్కారావు పేరు కరీంనగర్ రూరల్ మండలానికి పెట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ (Panjala Srinivas) డిమాండ్ చేశారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని, సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని కోరారు. శనివారం కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలోసాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా చామనపల్లి గ్రామంలో పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్.. చొక్కారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జండాను ఎగురవేశారు.

ఆ కుట్రలను తిప్పికొట్టాలి..

ఈ సందర్భంగా పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. దొరలు, భూస్వాముల దౌర్జన్యాలు, వెట్టి చాకిరి, నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమికోసం భుక్తి కోసం మహోన్నత తెలంగాణ రైతాంగ సాయుధ  పోరాటం జరిగిందని గుర్తు చేశారు. ఈ పోరాట చరిత్రను బీజేపీ మతపరమైన పోరాటంగా వక్రీకరించేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మహోన్నతమైన  సాయుధ పోరాట చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

సీపీఐ పార్టీ పేర్లను పెట్టకపోవడం దారుణం..

నిజాం నవాబ్ కబంధహస్తాల నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసి భారత దేశంలో విలీనం చేయాలనే డిమాండ్ తో కమ్యూనిస్టులు పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం పోరాట యోధుల పేర్లను ప్రభుత్వాలు వాడుకుంటున్నాయే తప్ప.. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన సీపీఐ పేర్లను చెప్పకపోవడం దారుణమని విమర్శించారు. సెప్టెంబర్ 17ని ప్రభుత్వం  అధికారికంగా నిర్వహించాలని.. తెలంగాణ పాఠ్యాంశాల్లో సాయిధ పోరాట నిజమైన చరిత్రను కమ్యూనిస్టుల త్యాగాలను చేర్చాలని  డిమాండ్ చేశారు.

హిందూ, ముస్లింల వివాదంగా వక్రీకరిస్తున్నారు..

తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ నేతలు కొందరు కావాలని హిందూ, ముస్లింల మధ్య జరిగిన వివాదంగా వక్రీకరిస్తున్నారని పంజాల శ్రీనివాస్ ఆరోపించారు. ఇది కేవలం భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా నిరుపేదలు చేసిన పోరాటమని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన సాయుధ పోరాటంలో చామనపల్లి చొక్కారావు పాల్గొని అనేకమంది ప్రజలకు విముక్తి కలిగించాడని గుర్తు చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని కోరారు. చొక్కారావు పేరును కరీంనగర్ రూరల్ మండలానికి పెట్టాలని.. ఆయన విగ్రహాన్ని కరీంనగర్ లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఉద్యమాలకు సిద్ధం కావలి..

నేటికీ భూమి కోసం, పంటలకు గిట్టుబాటు ధర కోసం, సామాజిక న్యాయం కోసం, నిరుద్యోగం, విద్య అవకాశాల కోసం నిలబడుతున్న ఏకైక పార్టీ సీపీఐ (CPI) అని పంజాల శ్రీనివాస్ కొనియాడారు. కమ్యూనిస్టు శ్రేణులంతా సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, చామనపల్లి సర్పంచ్ భోగండ ఐలయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐవైఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కసి బోసుల సంతోషాచారి, గ్రామ శాఖ కార్యదర్శి మెరుగు కొమురయ్య, నాయకులు పెద్ది రాజు, ఇరుకుళ్ళ బాబు, ఏం.రాములు, నాంపల్లి, పోసాని రాజేశ్వర్ రావు, పెరుమాళ్ళ శ్రీనివాస్, కాల్వల అశోక్, ఎల్లయ్య, ఎల్లా గౌడ్, గావు మణి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>