కలం, మునుగోడు: సీతారాం ఏచూరి ఆశయ సాధన కోసం, ఆయన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని సీపీఎం నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి (Nampally Chandramouli) అన్నారు. శనివారం నాంపల్లి మండల కేంద్రంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి ద్వితీయ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) నాంపల్లి మండల కార్యాలయంలో ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి (Sitaram Yechury) జీవితాంతం కార్మికులు, కర్షకులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడారని కొనియాడారు. భారతదేశంలో లౌకిక, ప్రజాస్వామ్య, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశంలో మతోన్మాదం, కార్పొరేట్ అనుకూల విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విశాల ప్రజా ఐక్యతను నిర్మించడంలో సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారని తెలిపారు.
పార్లమెంటరీ రాజకీయాలతో పాటు ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, మహిళలు మరియు విద్యార్థుల సమస్యలపై పోరాటాలను మరింత ఉధృతం చేయడమే సీతారాం ఏచూరికి నిజమైన నివాళి అని నాయకులు అన్నారు.
సీతారాం ఏచూరి చూపిన ప్రజా పోరాటాల మార్గంలో పయనిస్తూ దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు కొమ్ము హరి కృష్ణ, కష్పాక చంటి, సైదులు, రాజు తదితరులు పాల్గొన్నారు.

