కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో క్రీడలను విద్యతో అనుసంధానం చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) తెలిపారు. శాసనమండలిలో సభ్యులు బల్మూర్ వెంకట నర్సింగరావు, మహేష్ కుమార్, శ్రీపాల్ రెడ్డి, అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి, వారికి శాస్త్రీయ శిక్షణ, అత్యుత్తమ కోచింగ్ అందించడంతో పాటు స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, పరిశోధన వంటి విభాగాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే YIPESU ప్రధాన లక్ష్యమని మంత్రి శ్రీహరి స్పష్టం చేశారు. క్రీడాకారులకు కేవలం మైదానంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆధునిక క్రీడా విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన ఆధారిత శిక్షణ అందించే విధంగా YIPESUలో కోర్సులను రూపొందించనున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ వంటి అంతర్జాతీయ పోటీలకు తెలంగాణ క్రీడాకారులను సిద్ధం చేసేందుకు ఆధునిక శిక్షణ విధానాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి వెల్లడించారు.
గ్రామీణ ప్రాంతాల నుంచే క్రీడా ప్రతిభను వెలికితీస్తాం :
క్రీడా ప్రతిభ పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా తెలంగాణలోని ప్రతి గ్రామం నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి రావాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న మైదానాల ఆధునీకరణ, క్రీడా పరికరాల సమకూర్పు, పాఠశాల స్థాయి నుంచే క్రీడా ప్రతిభను గుర్తించడం, మండల–జిల్లా స్థాయిలో ప్రతిభా అన్వేషణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. అలాగే స్థానిక కోచ్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు అథ్లెటిక్స్, హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో తదితర క్రీడలకు ప్రోత్సాహం అందిస్తామని మంత్రి చెప్పారు.

