కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడ కాలనీలో దశాబ్దాల నాటి విద్యుత్ స్తంభాలకు ఎట్టకేలకు మార్పు చోటుచేసుకుంది. 1956లో ఏర్పాటు చేసిన పాత విద్యుత్ స్తంభాలు కాలక్రమేణా శిథిలావస్థకు చేరి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుండటంతో వాటి స్థానంలో నూతన సిమెంట్ విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసే పనులు చేపట్టారు. రాబోయే వినాయక శోభాయాత్రలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా పాత స్తంభాలను తొలగిస్తూ కొత్త స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో, వార్డు కౌన్సిలర్ అడప విజయలక్ష్మి సమన్వయంతో పనులు కొనసాగుతున్నాయి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ స్తంభాల మార్పు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అడప పోశెట్టి, గండ్రత్ వెంకటరమణ, నాయకులు గండ్రత్ రమేష్, లక్కడి జగన్మోహన్, విద్యుత్ శాఖ అధికారులు, వార్డు పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

