కలం, ఖమ్మం బ్యూరో : భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు సర్వం సిద్ధమైంది. జనవరి 18న ఆదివారం ఖమ్మం (Khammam) లో లక్షలాది మందితో బహిరంగ సభ జరగనుంది. ఎస్ఆర్ & బిజిఎన్ఆర్ (SR&BGNR) కళాశాల మైదానంలో జరిగే ఈ బహిరంగ సభకు ఆహ్వాన సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం జిల్లాలో ఇంత వరకు ఏ రాజకీయ పార్టీ నిర్వహించని రీతిలో సభను నిర్వహించేందుకు ఆహ్వాన సంఘం తగు ఏర్పాట్లు చేస్తుంది. 60 అడుగుల డిజిటల్ వేదికను తయారు చేసింది. సుదూర ప్రాంతం నుంచి కూడా వేదిక కనిపించే రీతిలో ఏర్పాట్లు చేశారు.
కళాశాల మైదానంలో విద్యుత్ దీపాలు అమర్చారు. 40 వేల మంది కూర్చునే విధంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో జనసేవాదళ్ మహిళలు, కేంద్ర నాయకత్వానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరం మొత్తం ఎర్ర తోరణాలు, జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రదర్శకులు ఇబ్బందులు పడకుండా దారి పొడవునా మంచినీటి సౌకర్యం కల్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆహ్వాన సంఘ కార్యదర్శి బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, ఆహ్వాన సంఘ బాధ్యులు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.


