సాయం చేస్తే 25వేల నగదు బహుమతి : మీకు తెలుసా?​

కలం, వెబ్​ డెస్క్​ : రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను సకాలంలో ఆదుకోవడం ద్వారా ప్రాణదాతలుగా నిలవాలని సీపీ సజ్జనార్ (CP Sajjanar) పిలుపునిచ్చారు. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదని, ప్రమాద సమయంలో భయపడి వెనకడుగు వేయకుండా మానవత్వంతో స్పందించాలని ఆయన కోరారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్) ఎంతో కీలకమని, ఆ సమయంలో అందించే చిన్న సాయం కూడా ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు.

బాధితులను ఆదుకునే వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘రహ్‌-వీర్’ పథకాన్ని(Rah-Veer Scheme) అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలు కాపాడిన వ్యక్తులకు 25,000 రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. అంతేకాకుండా, జాతీయ స్థాయిలో ఉత్తమ సేవకులుగా ఎంపికైన వారికి ఒక లక్ష రూపాయల నగదు పురస్కారం లభిస్తుందని సజ్జనార్ వివరించారు.

చాలామంది పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో సాయం చేయడానికి వెనుకాడుతుంటారని, అయితే అటువంటి ఆందోళన అవసరం లేదని ఆయన తెలిపారు. సాయం చేసిన వారిని వివరాలు తెలపాలని ఎవరూ ఒత్తిడి చేయరని, చట్టం వారికి పూర్తి రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రమాద స్థలంలో ఫోన్లతో వీడియోలు తీస్తూ సమయాన్ని వృథా చేయకుండా, తక్షణమే స్పందించి బాధితులను ఆసుపత్రికి చేర్చడంపై దృష్టి సారించాలని సూచించారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, రహదారి మరణాలు లేని సమాజాన్ని నిర్మించాలని సజ్జనార్​ (CP Sajjanar) పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>