పనిని బట్టి రేటు.. ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్లదే జోరు..!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఆర్టీఏ కార్యాలయాల్లో (RTA Offices) అవినీతి రాజ్యమేలుతున్న పట్టించుకునే నాధుడే లేడు.’పనిని బట్టి రేటు.. కాదంటే లేటు’ అనే చందంగా పనులు జరుగుతున్నాయి. తెలంగాణ రవాణా శాఖ కార్యాలయాల్లో దళారుల వ్యవస్థ, అధికారుల అవినీతి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆన్‌లైన్ సేవలు అని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం మామూళ్లు లేనిదే పనులు జరగని దుస్థితి ఆర్టీఏ కార్యాలయాల్లో నెలకొనిఉంది.

ఏడు ఆర్టీఏ ఆఫీసుల్లో 550 మంది ఏజెంట్లు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఏడు ఆర్టిఏ కార్యాలయాల్లో మొత్తం 550 నుంచి 600 మంది వరకు ఏజెంట్లు ఉన్నారు. ప్రతిరోజు ఒక్కో ఏజెంట్ ఐదు నుంచి పది ఫైళ్ల వరకు ఆర్టీఏ కార్యాలయాలకు పంపిస్తూ ఉంటాడు. ఏజెంట్లు ఒక్కో ఫైల్ కు రూ.500 నుంచి రూ.800 వరకు వాహనదారుల ద్వారా పనిని బట్టి వసూలు చేస్తారు. ఆర్టీఏ కార్యాలయాల్లో సేవలు పొందడానికి 60 శాతం మంది నిరక్షరాస్యులే రావడంతో ఏజెంట్లకు కలిసి వస్తుంది. మిగతా 40 శాతం మంది విద్యావంతులైనప్పటికిని రిస్కు మాకెందుకంటూ ఏజెంట్లకే పనులు అప్పగించడంతో ఏజెంట్లకు, అధికారులకు భారీగా డబ్బులు మిగులుతున్నట్లు తెలుస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతుందని ఉద్దేశంతోనే ప్రభుత్వం రవాణా చెక్​ పోస్టులను రద్దు చేసింది. ఉమ్మడి జిల్లాలోని అలంపూర్ రవాణా శాఖ చెక్​ పోస్టు, కృష్ణా దగ్గర ఉన్న చెక్ పోస్ట్ ను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఇబ్బందులు పడ్డ అధికారులు ప్రస్తుతం ఏజెంట్ల వ్యవస్థను పటిష్టం చేసుకోవడంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా పనులు సాఫీగా జరిగిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒక్కో పనికి ఒక్కో రేటు

ఆర్టీఏ ఆఫీసుల్లో ఒక్కో పనికి ఒక్కో రేటు అనధికారికంగా ఫిక్స్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్), స్లాట్ బుకింగ్, టెస్ట్ పాస్ చేయించడానికి ఏజెంట్ల ద్వారా నిర్దిష్ట మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. వాహన రిజిస్ట్రేషన్ (ఆర్సీ) కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ త్వరగా అవ్వాలంటే అదనపు రుసుము చెల్లించాల్సి వస్తోంది. లారీలు, బస్సుల ఫిట్‌నెస్ కోసం భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఆన్‌లైన్‌లో సామాన్యులకు స్లాట్లు దొరకకపోవడం, బ్రోకర్ల ద్వారా వెళ్తే వెంటనే దొరకడంతో ప్రజలు ఏజెంట్లను నమ్ముకోవాల్సి వస్తుంది. బ్రోకర్లు ఒక్కో స్లాట్‌కు రూ.500 నుండి రూ.800 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

డబ్బులు ఇవ్వని వారి ఫైళ్లను ఏదో ఒక సాకుతో పెండింగ్‌లో పెడుతున్నారు. సర్వర్ పనిచేయట్లేదని, డాక్యుమెంట్లు సరిగ్గా లేవని సామాన్యులను సాంకేతిక కారణాల పేర తిప్పుకుంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్సీ కార్డులు పోస్టులో ఇంటికి రావాల్సి ఉండగా, కొన్ని చోట్ల ఏజెంట్ల చేతికి ఇస్తున్నట్లు, కావాలనే ఆపుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇటీవల హైదరాబాద్‌లోని కొండాపూర్, నాగోల్, మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసింది. ఏజెంట్లు ఫైళ్లపై స్టార్ మార్కులు, కోడ్ పదాలు రాసి పంపిస్తున్నారు. ఆ గుర్తులు ఉంటేనే అధికారులు ఫైల్ కదిలిస్తున్నట్లు, లేకుంటే ఏదో కారణాలు చెప్పి ఫైల్ ను ఆపేస్తున్నట్లు తెలుస్తుంది.

అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్‌పోస్టులను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నో ఎంట్రీ ఫర్ బ్రోకర్స్ (దళారులకు ప్రవేశం లేదు) అనే నిబంధనను కఠినతరం చేసింది. అయినా ఒక్క ఏజెంట్ కూడా ఆర్టీఏ పరిసర ప్రాంతాల నుండి వెళ్లిపోవడం చూడలేదు. టెక్నాలజీ పెరిగినా, ఆర్టీఏ కార్యాలయాల్లో ‘పనిని బట్టి రేటు’ సంస్కృతి ఇంకా పోలేదు. ఏసీబీ దాడులు జరుగుతున్నా, కొద్ది రోజుల తర్వాత మళ్లీ పాత పద్ధతులే కొనసాగుతున్నాయని విమర్శలు ఉన్నాయి. పూర్తి స్థాయి ప్రక్షాళన జరిగితేనే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>