తెలంగాణ డీలిమిటేషన్ : ‘క్యూర్’లో పట్టు కోసం పార్టీల వ్యూహాలు

కలం, తెలంగాణ బ్యూరో : Telangana Delimitation | లోక్‌సభ, శాసనసభ సీట్ల పునర్ వ్యవస్థీకరణ కోసం డీలిమిటేషన్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదుగానీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న క్యూర్ (CURE) రీజియన్‌పై మాత్రం కాంగ్రెస్ పట్టు బిగించాలనుకుంటున్నది. హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ ఆశించినంతగా లేకపోవడంతో డీలిమిటేషన్ తర్వాత చాలా మార్పు వస్తుందనే భావనతో ఉన్నది. డీలిమిటేషన్ తర్వాత దాదాపు 60 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్నది ఓ అంచనా. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సీట్లు 179కు చేరుకోవచ్చని పార్టీలు భావిస్తున్నాయి. ఇందులో దాదాపు సగం క్యూర్, ప్యూర్ రీజియన్‌లలోనే కేంద్రీకృతమయ్యే అవకాశమున్నది. జిల్లాల్లో ఎలాగూ ప్రత్యర్థి పార్టీలకంటే బలంగా ఉన్నందున ఇకపై క్యూర్, ప్యూర్ ప్రాంతాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 28 అసెంబ్లీ సీట్లు డీలిమిటేషన్ ప్రక్రియతో దాదాపు 85 దాటవచ్చని అంచనా.

రెండింటితోనే సరిపెట్టుకున్న కాంగ్రెస్ :

జీహెచ్ఎంసీ, శివారు ప్రాంతాల్లోని మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల సమయంలో ఒక్కచోటా కూడా గెలవని కాంగ్రెస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ స్థానాలను మాత్రం గెల్చుకోగలిగింది. ఏడు చోట్ల మజ్లిస్, ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్, ఒక్క చోట బీజేపీ గెలిచాయి. BRSతో పోలిస్తే కాంగ్రెస్ బలం చాలా తక్కువ. భవిష్యత్తులో క్యూర్, ప్యూర్ (CURE and PURE) ప్రాంతాలు అభివృద్ధి చెంది మౌలిక సదుపాయాలపరంగా నగరంతో అనుసంధానమైతే అసెంబ్లీ సీట్ల సంఖ్య రెండు, మూడు రెట్ల స్థాయికి చేరుకుంటుంది. కాంగ్రెస్ బలపడకపోతే రాష్ట్రంలో దాదాపు సగం స్థానాలు ప్రత్యర్థుల చేతుల్లోనే ఉంటాయి. జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇది కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశమైనా క్యూర్, ప్యూర్ ప్రాంతంలోని మరిన్ని ప్రాంతాల్లో బలపడితే మాత్రమే ప్రత్యర్థిని ఓడించడం సాధ్యం.

బలాన్ని పెంపొందించుకునేలా బీఆర్ఎస్ ప్లాన్ :

GHMCతో పాటు పొరుగున ఉన్న సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో కాంగ్రెస్‌తో పోలిస్తే బీఆర్ఎస్ బలంగా ఉన్నందున ఈ పరిస్థితిని మరింత ఇంప్రూవ్ చేసుకోవడంపై గులాబీ లీడర్లు ఫోకస్ పెట్టారు. ఇటీవల చేపడుతున్న వరుస ఆందోళనలన్నీ ఈ ప్రాంతాలకు చెందినవే. ఎలాగూ డీలిమిటేషన్ తర్వాత భారీ స్థాయిలో సీట్లు పెరగనున్నందున ఈ బలాన్ని ఇంకొంత మెరుగుపర్చుకుంటే రాష్ట్రంలోని మొత్తం ఫలితాలనే ప్రభావితం చేయొచ్చన్నది దాని భావన. టెక్నికల్‌గా చూసుకుంటే హైదరాబాద్‌ జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 8, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 5 చొప్పున మొత్తం 28 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటితో పాటు క్యూర్, ప్యూర్ ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాలు చేరడం, డీలిమిటేషన్‌తో కొత్తగా పుట్టుకొచ్చేవి కలిపితే దాదాపు 85 దాటనున్నాయి. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని పట్టణ నియోజకవర్గాల్లో పాగా వేయాలన్నది బీఆర్ఎస్ ఆలోచన.

డీలిమిటేషన్ ఫార్ములా ఏదైనా సీట్లు పెరగడం ఖాయం :

డీలిమిటేషన్ కోసం ఏ ఫార్ములాను పరిగణనలోకి తీసుకున్నా రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగడం ఖాయం. క్యూర్, ప్యూర్ ప్రాంతాల్లోకి కొన్ని చేరడం, కొత్తవి పుట్టుకురావడంతో జనాభా రీత్యా సగం ఇక్కడే కేంద్రీకృతం కానున్నది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి సీలింగ్‌గా పెట్టుకున్న జనాభాను లెక్కలోకి తీసుకుంటే కూడా దాదాపు సగం పాపులేషన్ ఈ ప్రాంతంలోనే ఉంటారు. దీంతో సహజంగానే అసెంబ్లీ సీట్ల సంఖ్య కూడా జనాభా ప్రాతిపదికన ఇక్కడే పెరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ క్యూర్, ప్యూర్, ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, నగరాభివృద్ధి.. ఇలాంటి అంశాలను టేకప్ చేసింది. రాష్ట్రం మొత్తం మీ ఉంటే అసెంబ్లీ సీట్లలో సగం నగరంలోనూ, ఆనుకుని ఉన్న ప్రాంతాల్లోనూ ఉంటున్నందున ఏ పార్టీ విజయావకాశాలనైనా ఇక్కడి గెలుపే నిర్ణయించనున్నది. అందుకే ఈ ప్రాంతంలో ఎన్ని ఎక్కువ గెల్చుకుంటే అంత ఎక్కువ ప్రయోజనం అనేది కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్లాన్.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>