కలం, భువనగిరి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు (Nitin Nabin) దేశ రాజకీయాలు, తెలంగాణ భౌగోళిక, రాజకీయ పరిస్థితులపై కనీస అవగాహన లేనట్లు కనిపిస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నితిన్ నబీన్‌కు ఇక్కడి స్థానిక నేతలు తప్పుడు ఇన్పుట్స్ ఇచ్చి గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. గతంలో బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్కి ‘ఏటీఎం’లా మారిందని స్వయంగా విమర్శలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
గత పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కాళేశ్వరంలో ఎవరు అవినీతికి పాల్పడ్డారో స్పష్టంగా తెలుసన్నారు. ఇప్పుడు నితిన్ నబిన్ వచ్చి అవినీతి జరగకుండా చూస్తామని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాళేశ్వరం అవినీతిని సీబీఐకి ఇస్తే 48 గంటల్లో నిందితులకు బుద్ధి చెబుతామని, గతంలో బీజేపీ నేతలు ప్రగల్భాలు పలికారని.. తీరా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా లేఖ రాసినప్పటికీ, ఈ కేసును సీబీఐకి ఎందుకు అప్పగించలేదని ఎంపీ నిలదీశారు. దీని వెనుక ఉన్న లాలూచీ ఏంటో చెప్పాలన్నారు.
“నితిన్ (MP Chamala) నబిన్ది పూర్తిగా బీహార్ మైండ్ సెట్. దేశంలో పర్యటనలు చేసే ముందు అన్ని రాష్ట్రాల పరిస్థితులను ఆయన అధ్యయనం చేయాలి” అని చామల హితవు పలికారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీది స్వచ్ఛమైన ‘ఇండియన్ మైండ్ సెట్’ అని.. దేశ ప్రజలకు, తెలంగాణ సమాజానికి ఏం కావాలో ఆమెకు ముందే తెలుసని స్పష్టం చేశారు. 2014లో నరేంద్ర మోదీ దేశ యువతకు ఏటా ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారో, మరి ఈ పన్నెండేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో నితిన్ ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
తెలంగాణలో బీజేపీకి ఎలాంటి స్పష్టమైన ఎజెండా లేదని, ఇక్కడ ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు కేవలం తెరవెనుక ‘మ్యాచ్ ఫిక్సింగ్’ రాజకీయాలు చేసుకుంటూ గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. జాతీయ స్థాయి నేతగా 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి వచ్చిన ఓట్లు ఎన్ని? 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎన్ని? అనే వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో సాగుతున్న పొలిటికల్ ఫిక్సింగ్ గేమ్స్ గురించి నితిన్ ముందుగా తెలుసుకుంటే మంచిదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు.
Read Also: ఆదివాసీల అభివృద్ధే బీజేపీ లక్ష్యం : నితిన్ నబీన్
Follow Us On: Instagram

