కలం, వెబ్ డెస్క్ : వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ఖైరతాబాద్ మహా గణనాథుడి (Khairatabad Ganesh)ని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే మండపం వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పంచముఖ సంకటహర మహాగణపతిగా కొలువుదీరిన స్వామివారిని తొలిరోజే సాయంత్రం 6 గంటల సమయానికే దాదాపు 75 వేల మందికి పైగా భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీస్ శాఖ ఇప్పటికే ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు, దర్శనానికి వచ్చేవారి కోసం విశాలమైన పార్కింగ్ ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాలు ఈ నెల 24 వరకు వైభవంగా కొనసాగనుండగా, సెప్టెంబర్ 25వ తేదీన మహా గణపతి నిమజ్జన కార్యక్రమం జరగనుంది.

