కలం, నల్లగొండ బ్యూరో : సూర్యాపేట (Suryapet) జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తూ 340 కేంద్రాల ద్వారా సన్నద్ధత చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ (Tejas Nandlal Pawar) తెలిపారు. జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా కొనుగోళ్లు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం నూతనకల్ మండలం గుండ్ల సింగారం ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొత్త కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ, సివిల్ సప్లయ్ శాఖలు సమన్వయంతో ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు అవసరమైన తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు, తాగునీరు వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, రాబోయే రోజుల్లో రోజుకు 5 నుంచి 6 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.
లారీలను సరిపడా ఏర్పాటు చేయాలని, అవసరమైతే సంఖ్య పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం వేళల్లోనే కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని చెప్పారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని కలెక్టర్ (Tejas Nandlal Pawar) స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిఒ ప్రవీణ్, డిఎం సివిల్ సప్లయస్ శ్రీధర్ రెడ్డి, డిఎస్ఓ మోహన్ బాబు, ఆత్మకూరు, నూతనకల్లు మండల తహసీల్దారులు అమీన్ సింగ్, శ్రీనివాసరావు, ఎంపీడీవో హసీం, సునీత తదితరులు పాల్గొన్నారు.
Read Also: సీఎం జోలికి రావొద్దు.. జీవన్ రెడ్డికి మంత్రి అడ్లూరి స్ట్రాంగ్ వార్నింగ్!
Follow Us On: Instagram

