స‌ర్కారు బ‌డుల్లో వంద శాతం హాజ‌రు త‌ప్ప‌నిస‌రి: కలెక్టర్ రిజ్వాన్

క‌లం, గద్వాల: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Collector Rizwan Basha Shaikh) మండల విద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తూ, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ సహకారంతో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలన్నారు. ఎఫ్ ఆర్ ఎస్ హాజరు 100 శాతం నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు,ఉపాధ్యాయులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలన్నారు.ఉపాధ్యాయులు సెలవు తీసుకోవాల్సి వస్తే తప్పనిసరిగా సంబంధిత ఎంఈఓ లేదా డీఈఓ నుంచి ముందస్తు అనుమతి పొందాలని,అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను గణనీయంగా పెంచేలా క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు. హాస్టళ్లలో సీట్లు లభించని విద్యార్థులను గుర్తించి సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న డ్రాప్‌బాక్స్ అంశాలను పది రోజుల్లోగా క్లియర్ చేయాలని ఆదేశించారు.ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో డ్రాప్‌బాక్స్ క్లియరెన్స్ కోసం ఒక్కో పాఠశాలకు ఒక నోడల్ అధికారిని నియమించి, తరగతి వారీగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఆధార్,అపార్ తదితర అంశాల్లో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యల కారణాలను గుర్తించి నివేదిక సమర్పిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. హైస్కూల్ విద్యార్థులు ఫిజిక్స్ వాల,అన్ అకాడమీ వంటి ఆన్‌లైన్ విద్యా వేదికల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి,లాగిన్ అయ్యేలా చూడాలని సూచించారు.సంబంధిత పాఠ్యాంశాల వీడియోలను ఇంటి వద్ద వీక్షించేలా ప్రోత్సహించి విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించాలన్నారు.

పీఎం శ్రీ పాఠశాలలకు వచ్చిన నిధులను పూర్తిస్థాయిలో పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని, నిధులు తిరిగి వెళ్లకుండా అవసరమైన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత,పోషణ్ యాప్ నమోదు,ఆహార రిజిస్టర్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.ఎల్‌పీజీ సౌకర్యం ఉన్న పాఠశాలల వివరాలను పోషణ్ యాప్‌లో అప్‌డేట్ చేయడంతో పాటు, భోజనం నాణ్యతపై పాఠశాల కమిటీ అభిప్రాయాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పాములు వంటి విషపురుగులు పాఠశాల ప్రాంగణంలోకి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రతి పాఠశాలలో భద్రత,పరిశుభ్రతను పర్యవేక్షించేందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు.బవిత కేంద్రంలో నిర్వహించే స్పోర్ట్స్ డే కార్యక్రమాన్ని విద్యార్థులకు ఉపయోగకరంగా, ఆకర్షణీయంగా నిర్వహించాలన్నారు.

విద్యార్థులకు యూనిఫాంల పంపిణీని వేగవంతం చేసి సెప్టెంబర్ 5లోగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో యూనిఫాంలు అందించాలన్నారు.విద్యార్థుల అవసరాల దృష్ట్యా మరుగుదొడ్ల నిర్మాణ,మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి,100 శాతం ఉత్తీర్ణత సాధించేలా పాఠశాలల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ పాఠశాలలను తరచూ తనిఖీ చేసి, విద్యా ప్రమాణాలను పర్యవేక్షించాలన్నారు.జిల్లాలోని అన్ని కోచింగ్ సెంటర్లను ఎంఈఓలు తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు.

అలంపూర్ చౌరస్తాలోని ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు మెమోలు, టీసీలు జారీ చేయకుండా పెండింగ్‌లో ఉంచిన సమస్యను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత ఎంఈఓను ఆదేశించారు. విద్యార్థులకు మెమోలు ఇవ్వని పాఠశాల యాజమాన్యంపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి విజయ లక్ష్మి,అన్ని మండలాల విద్యాధికారులు,తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>