కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ తో కలిసి అర్జిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జిదారుల సమస్యలను సావధానంగా విన్నారు. ప్రతి సమస్యను జాగ్రత్తగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు.
అధికారులు ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా చదివి అర్థంచేసుకుని క్షేత్ర స్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని అన్నారు. ప్రజావాణిలో పంచాయతీరాజ్, మున్సిపల్, నీటిపారుదల, జిల్లా సంక్షేమం, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖ, భూ సర్వే రికార్డులు, గృహ నిర్మాణం, రోడ్డు రవాణా, పోలీస్, గిరిజన అభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ, విద్య, వైద్య ఆరోగ్యం , మైనింగ్, అటవీ, గ్రామీణ అభివృద్ధి, తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 142 వినతులను అధికారులు స్వీకరించారు.
ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా సంక్షేమ శాఖ రూపొందించిన పౌష్టిక ఆహార అవగాహన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైనీ సాయి శివాని, భూ సేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్ రెడ్డి, జెడ్. పి. సి. ఈ.ఓ, ఇంచార్జి డి. పి. ఓ వెంకట రెడ్డి, డి. ఆర్. డి.ఓ నరసింహులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

