కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని (Shadnagar) ఓప్రైవేట్ పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాఠశాల మెట్లపై నుంచి జారిపడి నాలుగో తరగతి విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన విద్యార్థిని కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపగా, పాఠశాల పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
మెట్లపై నుంచి జారిపడిన విద్యార్థిని
ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 9 ఏళ్ల వర్ణిక నిన్న మెట్లపై నుంచి ఒక్కసారిగా జారిపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఘటనను గమనించిన పాఠశాల (Private School) సిబ్బంది వెంటనే విద్యార్థినిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. వర్ణికకు తలకు బలమైన గాయం కావడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగింది. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూనే ఇవాళ వర్ణిక మృతి చెందింది.
ఘటనపై వివరాలు సేకరిస్తున్న అధికారులు
విద్యార్థిని మెట్లపై నుంచి పడిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది? ఆ సమయంలో అక్కడ ఎవరున్నారు? అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. పాఠశాలలో విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపైనా పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది.

