కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) అక్టోబర్ ఒకటో తేదీ నుంచి యూరప్ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ మేరకు అనుమతి కోరుతూ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. పలు నిబంధనలతో అనుమతులు జారీ చేసింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి నవంబర్ 30వ తేదీల మధ్య యూరప్ వెళ్లేందుకు అంగీకరించింది. పర్యటనకు వెళ్లే ముందు సీబీఐ కోర్టుకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.
విదేశాల్లో ఎక్కడ ఉంటున్నారో తెలపడంతో పాటు అవసరమైతే సంప్రదించేలా ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ సమర్పించాలని జగన్‌కు సూచించింది. పర్యటన తిరిగి వచ్చిన వెంటనే పాస్ పోర్ట్ అప్పగించాలని కూడా పేర్కొంది. సీబీఐ కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్.. ప్రస్తుతం బెయిల్ మీదనే ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశం దాటి వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అవుతోంది.
నెల రోజుల పాటు..
వైఎస్ జగన్ నెల రోజుల పాటు యూరప్ పర్యటనకు వెళ్లబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆయన ఇద్దరు కుమార్తెలు లండన్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటనగా చెబుతున్నాయి. జగన్ ఎప్పుడూ విదేశాలకు వెళ్లినా యూరప్‌కే వెళ్తుంటారు. ఒక్కసారి మాత్రమే అమెరికాకు వెళ్లారు. నవంబరు నెలాఖరులో తిరిగి వచ్చాక పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసే అవకాశం ఉందని సమాచారం.

