దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి ఔట్!

కలం, వెబ్ డెస్క్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి కోల్పోయారు. ఆయనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయన ఎంపీగా పోటీ చేసిన 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే అనర్హత అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. స్పీకర్ ఆదేశాలపై స్టే విధించిన హై కోర్టు.. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ బీ–ఫామ్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దానంపై అనర్హత వేటు వేయడంలో ఇదే బలమైన ఆధారంగా నిలిచింది.

దానం లాయర్లు ఏమన్నారంటే..

హై కోర్టులో దానం లాయర్లు లేవనెత్తిన అంశాలను హై కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికిప్పుడు అనర్హత వేటు వేస్తే నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో అప్పీల్ చేసే వరకైనా.. తీర్పుపై స్టే విధించాలని కోరినా హై కోర్టు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. చివరికి ఆయన్ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది.

మూడు రోజుల కిందటే వేటు పడుతుందని..

ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తుది తీర్పు మూడు రోజుల క్రితమే వెలువడుతుందని భావించినా.. అది ఈ రోజుకు వాయిదా పడింది. దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ తరఫున ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టు గతంలో విచారణ చేపట్టి.. నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు డెడ్‌లైన్‌ విధించిందని పిటిషనర్లు పేర్కొన్నారు.

విచారణ అనంతరం దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపు చర్యలకు ఆధారాలు లేవంటూ స్పీకర్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారని తెలిపారు. స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై పలు ఆధారాలతోపాటు వీడియో ఫుటేజీని కూడా పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. అన్ని వైపులా వాదనలు పూర్తిచేసిన హైకోర్టు.. శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>