కలం, నిర్మల్: విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని, స్పోర్ట్స్ అరీనాలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. గురువారం నిర్మల్ పట్టణ, గ్రామీణ మండలాల్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించి వివిధ సంస్థలు, అభివృద్ధి పనులను పరిశీలించారు.
సోఫీనగర్‌లోని బాలికల సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాల వసతిగృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు మెరుగైన భద్రతతోపాటు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని సూచించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెమిస్టర్ పరీక్షల సమయానికి సిలబస్ పూర్తిచేయడంతోపాటు, విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని అధ్యాపకులకు సూచించారు.
దివ్యనగర్‌లోని స్పోర్ట్స్ అరీనాను పరిశీలించి క్రీడాకారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కలెక్టర్ (Bhavesh Mishra) ఆదేశించారు. క్రీడలు ఆడేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. షటిల్ బ్యాడ్మింటన్, పికిల్‌బాల్ కోర్టుల పరిసరాల్లో ప్రతిరోజూ పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని సూచించారు. మహాలక్ష్మీవాడ సమీపంలోని యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించి జంతువుల స్టెరిలైజేషన్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
డంప్ యార్డును పరిశీలించిన కలెక్టర్.. తడి, పొడి చెత్త వేర్పాటు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. గండిరామన్న నుంచి కమలానగర్ వరకు చేపడుతున్న అటవీ, రెవెన్యూ భూముల రీ-సర్వే పనులను పరిశీలించారు. సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి, అటవీ, రెవెన్యూ శాఖల భూముల హద్దులను స్పష్టంగా గుర్తించాలని అధికారులకు సూచించారు.

