కలం, బాసర: ఇల్లు లేని పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అన్నారు. ఆదివారం బాసర మండలం లాబ్ధి గ్రామంలో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు తోకలవాడ్ అనూష బాయి – నర్సింగ్ కుటుంబంతో కలిసి వారి నూతన గృహంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇంటి నిర్మాణ వివరాలు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించారు. మిఠాయిలు, పిల్లలకు టపాసులు, నోటుపుస్తకాలు అందజేసి చక్కగా చదువుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లాబ్ధి గ్రామం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ముందంజలో ఉండటం అభినందనీయమన్నారు.
ఇతర గ్రామాలకు ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంలో విశేష పురోగతికి కృషి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేద కుటుంబాల్లో సొంతింటి ఆనందం వెల్లివిరుస్తోందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. లబ్ధిదారుల ఇంట్లో వారితో కలిసి దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఎంపీవో గంగాసింగ్, సర్పంచ్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

