కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదని కొట్టిపారేశారు. అధికారం అడ్డం పెట్టుకుని కేసీఆర్ అహంకారంతో పనిచేశాడని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు భరించలేక అధికారం నుంచి ప్రజలు దించేశారని విమర్శించారు. ఉన్న పార్టీ ఉంటుందో పోతుందో తెలియదని మండిపడ్డ రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కొత్త పార్టీకి ఏం పని? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పార్టీకే మనుగడ లేదని.. చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ఒకటేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉద్యమం అప్పుడు ఎలా మాట్లాడినా సహించారని.. అధికారంలో ఉన్న పదేళ్లు కూడా అలాగే మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబమంతా ఒక్కటేనని.. రంగు, రుచి లేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్ చిట్‌చాట్‌లో మాట్లాడారు.
దాదాపు 15 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి రాష్ట్రం ఏర్పాటయ్యాక 10 ఏళ్ళ సుదీర్ఘ పాలనను బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిందని.. అలాంటి తమ పార్టీపై సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఒక పోరాట, రాజకీయ చరిత్ర కలిగిన పార్టీని అవమానించేలా మాట్లాడటం సరికాదని పేర్కొంటున్నాయి.

