కలం, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సహకరిస్తానని సీఎం రేవంత్ అన్నారు. కోకాపేటలో అల్లు కుటుంబం స్థాపించిన అల్లు సినిమాస్ థియేటర్ ను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాను సినిమా అభిమానిని అని.. సినిమా రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. అల్లు కుటుంబం సినిమాకు గొప్ప పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని వెల్లడించారు. తాను ఈ మధ్య ఇంత పెద్ద థియేటర్ ను చూడలేదని.. ఇలాంటి థియేటర్లు ఆడియెన్స్ కు మంచి ఫీల్ ఇస్తాయని వివరించారు.
‘అల్లు కుటుంబం దేశంలో సినిమాకు గొప్ప పేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అల్లు ఫ్యామిలీని అందుకు నేను అభినందిస్తున్నాను. అల్లు అర్జున్ మంచి నటుడు అతను హాలీవుడ్ లోనూ రాణించాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ తో కాదు హాలీవుడ్ తో పోటీ పడాలి. జపనీస్, కొరియన్ సినిమాలకు ధీటుగా నిలవాలి. అందుకు మా ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. టాలీవుడ్ అవసరాలను గుర్తించి మేం అందుకు సపోర్ట్ చేస్తున్నాం’ అని సీఎం వివరించారు .
ఐటీ, ఫార్మా రంగాలతో సమానంగా సినిమా రంగం అభివృద్ధి చెందాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. అందుకు తన సహకారాలు ఎప్పటికీ ఉంటాయన్నారు. ‘నేను కూడా సినిమా అభిమానినే. లారీ ఎక్కి వనపర్తి కి వెళ్లి సినిమాలు చేసే వాడిని. నేను కృష్ణ అభిమానిని. సినిమా సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. మన సినిమాలకు గొప్ప కళాకారులు, టెక్నీషియన్లు వస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ లక్షలాది మందికి ఉపాధి కల్పించాలి’ అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.

