కలం, వెబ్ డెస్క్ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, అభివృద్ధి విషయాలపై చర్చించారు. తెలంగాణలో ఇప్పటికే ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)తో పాటు మరిన్ని ప్రాంతాలకు విమానయాన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకు రావాలని సీఎం, కేంద్ర మంత్రిని కోరారు.
వరంగల్ సమీపంలోని మామునూరు విమానాశ్రయానికి (Mamnoor Airport) సంబంధించి భూసేకరణ ప్రక్రియ పూర్తయినందునా అవసరమైన తదుపరి పనులు వేగంగా చేపట్టాలని, విమానాశ్రయ నిర్మాణం త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రాజెక్ట్ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగూడెం ఎయిర్‌పోర్టు (Kothagudem Airport) కోసం పాల్వంచలో స్థలాన్ని గుర్తించినట్లు సీఎం వివరించారు. ఈ స్థలంలో OLS సర్వే, ఫీజిబిలిటీ స్టడీలను త్వరగా నిర్వహించాలని, అనుమతులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం అంతర్గాం ఎయిర్‌పోర్టు కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించినట్లు సీఎం తెలియజేశారు. దీనికి సంబంధించిన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు సంబంధించి అదనంగా 249.82 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వానికి అందజేయడానికి సిద్ధంగా ఉంచినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇది ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి, సంబంధిత ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ అందించడానికి దోహదపడుతుందని ఆయన (Revanth Reddy) వివరించారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూల స్పందన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Read Also: క్యాంప్ పాలిటిక్స్.. పార్టీల కౌంటర్ స్ట్రాటెజీ
Follow Us On: Sharechat


