కలం, కరీంనగర్ బ్యూరో: “గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన నిర్లక్ష్యానికి, నిర్వీర్యానికి కాంగ్రెస్ ‘ప్రజాపాలన’ పూర్తిస్థాయిలో చెక్ పెడుతోంది” అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) ధ్వజమెత్తారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత ప్రజలు కన్న కలలు, అమరులు, ఉద్యమకారుల ఆశయాలు గత పాలకులు తుంగలో తొక్కితే, నేడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిజం చేస్తోందని స్పష్టం చేశారు.
రేపు కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటించి, నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యానికి విద్యారంగం బలైందని విమర్శించిన మంత్రి, దశాబ్ద కాలంలో శాతవాహన యూనివర్సిటీకి కనీసం వీసీని కూడా నియమించలేని దౌర్భాగ్య స్థితిలో గత ప్రభుత్వం ఉండిపోయిందని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూనివర్సిటీని పునరుద్ధరించి ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఫార్మసీ, ఇంజనీరింగ్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. నిరుద్యోగుల కలలను నిజం చేస్తూ అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే 70 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హాస్టళ్లలో డైట్, కాస్మెటిక్ ఛార్జీలను భారీగా పెంచినట్లు పేర్కొన్నారు. ప్రైవేటుకు దీటుగా గురుకులాలు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు.
ఆగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు ఊపిరి
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నెపంతో సంక్షేమాన్ని నిలిపివేయకుండా, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. “మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పరిమితి పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహజ్యోతి), ఇందిరమ్మ ఇళ్లు, అర్హులకు సన్నబియ్యం, రైతు భరోసా, పంటలకు బోనస్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో ప్రతి ఇంటా సంతోషం నింపుతున్నాం.”
కరీంనగర్ అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిలిచిపోయిన ఎల్లంపల్లి, లోయర్ మానేరు, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, గౌరవెల్లి, కలికోట సూరంపేట ప్రాజెక్టుల పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి వెల్లడించారు. గౌరవెల్లి భూసేకరణ కోసం రూ. 250 కోట్లు, మిడ్ మానేరు బాధితుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించామని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్, డంపింగ్ యార్డ్, రింగ్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసి, ఉమ్మడి జిల్లాను విద్యా, పారిశ్రామిక, సాగునీటి రంగాల్లో ముందంజలో ఉంచుతామని ధీమా వ్యక్తం చేశారు.
రేపటి సీఎం పర్యటన విశేషాలు
కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం, కలెక్టర్ ఛాంబర్లో ప్రత్యేక పూజలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, జిల్లా అధికారులతో సమగ్ర సమీక్షా సమావేశం, సిరిసిల్లలో అంబేద్కర్ విగ్రహం నుండి పాదయాత్ర, అనంతరం బహిరంగ సభ, చేనేత పవర్లూమ్ కార్మికుల సమస్యలు, పాత బకాయిల చెల్లింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు.

