కలం, వెబ్ డెస్క్: అథ్లెటిక్స్‌లో రాణిస్తున్న క్రీడాకారులందరికీ ‘ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం’ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి, యువత భవితవ్యానికి పునాదిగా క్రీడాకారులు అథ్లెటిక్స్ (World Athletics Day)లో రాణిస్తున్నట్లు తెలిపారు. క్రీడలను ప్రోత్సహిస్తూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రజాప్రభుత్వం క్రీడారంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని వివరించారు. ఒలింపిక్స్‌లో రాణించాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. అంతే కాకుండా యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU)ని ప్రారంభించిన విషయాన్ని ప్రస్తావించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో గచ్చీబౌలీ స్టేడియంను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు.
అథ్లెటిక్స్‌తో ప్రతి మనిషిలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీస్తాయని సీఎం రేవంత్ చెప్పారు. శరీరాన్ని దృఢంగా, మనసును స్థిరంగా ఉంచేందుకు క్రీడలు తీర్చిదిద్దుతాయని చెప్పారు. శారీరకంగా, మానసిక దృఢత్వమే కాకుండా క్రమశిక్షణ, పట్టుదల పెంచే అథ్లెటిక్స్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం, విజయానికి దారితీసే ప్రయాణాన్ని ప్రారంభిద్దామని క్రీడాకారులు, క్రీడాభిమానులకు పిలుపునిచ్చారు.

