కలం, వెబ్ డెస్క్: భారత బాస్కెట్‌బాల్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన స్టార్ ప్లేయర్ ఉల్హాస్ కేఎస్ తాజాగా ఓ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బుధవారం ఉల్హాస్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. బాస్కెట్‌బాల్ క్రీడకు ఆయన చేసిన సేవలను, అంతర్జాతీయ వేదికలపై సాధించిన విజయాలను సీఎం ఈ సందర్భంగా అభినందించారు. తమిళనాడులో జన్మించిన ఉల్హాస్ ప్రస్థానం యూకే (యునైటెడ్ కింగ్‌డమ్) లో ప్రారంభమైంది.
అక్కడ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్ బాస్కెట్‌బాల్ జట్టుకు ఆయన కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలో ఆ జట్టు లండన్ ఇంటర్-యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయం ఆయనకు యూరప్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. ఆ తర్వాత ఉల్హాస్ వెనుతిరిగి చూసుకోలేదు. యూరప్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్‌లో స్థానం సంపాదించుకున్న తొలి భారతీయ ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారు.
ఎంతోమంది అంతర్జాతీయ ఆటగాళ్లను ఎదుర్కొంటూ పలు దేశాల్లో రాణించారు. సెర్బియాకు చెందిన ప్రముఖ ‘నోవి పజార్ సాలమండర్’ జట్టు తరఫున ఆడటం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయి. ఆ తర్వాత మోల్డోవా నేషనల్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో ‘గ్లోరియా బాస్కెట్‌బాల్ క్లబ్’ తరఫున ఆడి తన ప్రతిభను చాటుకున్నారు. ఉల్హాస్ క్లబ్ క్రికెట్‌కే పరిమితం కాకుండా ఫిబా (FIBA) బాస్కెట్‌బాల్ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
మోల్డోవా నేషనల్ లీగ్ డివిజన్ 1లో అత్యధిక స్కోరు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించారు. అటు భారతదేశంలోనూ, ఇటు యూకే లోనూ పలు ఛాంపియన్‌షిప్ టైటిళ్లను గెలుచుకొని తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ గౌరవం అందుకోవడంపై ఉల్హాస్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత ప్రయాణమే కాకుండా, భారత బాస్కెట్‌బాల్ ఎదుగుదలకు గుర్తింపు అని పేర్కొన్నారు.
కష్టపడే తత్వం, ప్రతిభ ఉంటే భారతీయ క్రీడాకారులు ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలరని చెప్పారు. ఈ సన్మానం యువ అథ్లెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, క్రీడల అభివృద్ధికి తన వంతు కృషిని కొనసాగిస్తానని ఆయన వెల్లడించారు.

