కలం, వెబ్ డెస్క్: ఏపీలో జూన్ 2024 నుంచి తాజాగా నిర్వహించిన సీఐఐ సదస్సు వరకు మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల విలువ రూ.32.49 లక్షల కోట్లకు చేరిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రకటించారు. కియా రూ.18,878 కోట్లతో పెనుకొండ ప్లాంటు వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు లక్షల వాహనాల మేర పెంచేందుకు ముందుకొచ్చిందని.. దీని ద్వారా అదనంగా 12,000 ఉద్యోగాలకు అవకాశం లభిస్తుందని చెప్పారు. ప్రస్తుత పాలనలో ప్రాంతీయ సదస్సులు, ప్రధాన సమ్మిట్ కలిపి 303 కొత్త పెట్టుబడి ఒప్పందాలు (AP Investments) కుదుర్చుకున్నామని.. సుమారు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. దీనితో 3,48,309 ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం విశాఖపట్నంలో నిర్వహించిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit)లో సీఎం ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఏపీకి పెట్టుబడి ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు స్పష్టతనిచ్చారు. జూన్ 2024 నుంచి ఈ సమ్మిట్‌కు ముందు వరకు 714 ప్రాజెక్టులకు సంబంధించి రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. వీటి ద్వారా 19.3 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఏర్పడే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. వాటిలో 526 ప్రాజెక్టులకు భూమి, ప్రోత్సాహకాలకు ఆమోదం తెలిపామని చెప్పారు. వాటి పెట్టుబడి విలువ రూ.17.10 లక్షల కోట్లు ఉంటుందని.. వీటి ద్వారా 12.9 లక్షల ఉద్యోగాలకు అవకాశం లభిస్తుందని అన్నారు.
ఏపీలో ఇప్పటికి 303 ప్రాజెక్టులు నిర్మాణం ప్రారంభమయ్యాయని సీఎం చెప్పారు. వీటి పెట్టుబడి విలువ రూ.7.30 లక్షల కోట్లు ఉంటుందని.. వీటి ద్వారా 7.7 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని చెప్పారు. విశాఖ సమ్మిట్‌కు ముందు ఐదు దేశాల్లో, దేశంలోని ఆరు నగరాల్లో కలిపి 11 పెట్టుబడి రోడ్‌షోలు నిర్వహించామని స్పష్టం చేశారు. విశాఖలో ఏఐ, డేటా సెంటర్లు, కాకినాడలో సముద్ర ఆధారిత పరిశ్రమలు, అమరావతిలో క్వాంటమ్, అనంతపురంలో రక్షణ రంగం, తిరుపతిలో ఎలక్ట్రానిక్స్‌పై ప్రాంతీయ సదస్సులు జరిగాయన్నారు.
ఇదే ఏడాది అక్టోబర్ 7 నుంచి 26 వరకు జరిగిన ప్రాంతీయ సదస్సుల్లో 194 ఒప్పందాలు కుదిరాయని.. వాటి పెట్టుబడి విలువ రూ.86,522 కోట్లు ఉంటుందని సీఎం తెలిపారు. వీటి ద్వారా 1,47,951 ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు. ఇక నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో జరిగిన ప్రధాన సమ్మిట్‌లో 109 ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. వాటి పెట్టుబడి విలువ రూ.9,02,434 కోట్లు ఉంటుందని.. వీటి ద్వారా 2,00,358 ఉద్యోగాలకు అవకాశం ఉందని తెలిపారు.

