కలం, వెబ్ డెస్క్: ‘అడవి తల్లి ఒడిలోనే ఉంటాం. పులులతో మమేకం అవుతాం. తరతరాలుగా నివాసం ఉంటున్న అటవీ ప్రాంతాన్ని వదలం. మమ్మల్ని బతుకనివ్వండి’ అని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్ Amrabad Tiger Reserve) ప్రాంతం చెంచులు స్పష్టం చేశారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో జరిగిన సీఎం ప్రజావాణికి ఏటీఆర్ ప్రాంత చెంచు జాతి గిరిజనులు తరలివచ్చారు. సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డిని కలిసి తమ సమస్యలను తెలిపారు. తరతరాలుగా అడవి తల్లిని నమ్ముకుని అడవుల్లోనే నివసిస్తున్న తాము చెంచు పెంటలను ఖాళీ చేసి బయటి ప్రాంతానికి వెళ్లి జీవించలేమని స్పష్టం చేశారు. అడవిలో పరిస్థితులు ఎలా ఉన్నా పులులతో కలిసి జీవించేందుకు కూడా తాము సిద్ధమే అని స్పష్టం చేశారు. చెంచు పెంటలను మాత్రం బలవంతంగా ఖాళీ చేయించవద్దని ఏటీఆర్ చెంచులు (Chenchu Tribe) కోరారు. అటవీ చట్టాలను శాఖపరంతోపాటు చెంచుపెంటలకు కూడా వర్తింపచేయాలని చెంచులు కోరారు.
ప్రభుత్వం భరోసా
డాక్టర్ జి.చిన్నారెడ్డి స్పందిస్తూ చెంచులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చెంచుల అభీష్టం మేరకు ముందుకు సాగుతామని భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్రతో చిన్నారెడ్డి ఫోన్ ద్వారా సంప్రదించారు. చెంచు కుటుంబాలను అటవీ ప్రాంతం నుంచి బలవంతంగా ఖాళీ చేయించే ప్రసక్తే లేదని తెలిపారు. అటవీ అధికారులు, చెంచులతో సమావేశం కోసం చిన్నారెడ్డి షెడ్యూల్‌ను ఖరారు చేయించారు.
సీఎం ప్రజావాణికి 401 దరఖాస్తులు
శుక్రవారం నిర్వహించిన సీఎం ప్రజావాణికి మొత్తం 401 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 110, రెవెన్యూ శాఖకు సంబంధించి 72, ఇందిరమ్మ ఇండ్ల కోసం 125, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 92 దరఖాస్తులు అందాయి.
Read Also: లోక్ సభలో వీగిన మహిళా రిజర్వేషన్ బిల్లు
Follow Us On : WhatsApp

