కలం, పెద్దపల్లి: వివిధ రంగాలలో ప్రఖ్యాతులైన సుమారు 200 మంది కళాకారులు ఒకే వేదికపైకి వచ్చి తమ ప్రదర్శనలతో సందడి చేశారు. సంస్కృతీ, సృజనాత్మకతకు అద్దం పడుతూ నైపుణ్యతను ప్రదర్శించారు. జానపద, శాస్త్రీయ ఆట.. పాటలతో కళాభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ప్రపంచ జానపద కళల దినోత్సవం పురస్కరించుకొని కృషి కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో గోదావరిఖని (Godavarikhani)లోని శ్రీ వేంకటేశ్వర కళ్యాణ మండపంలో కళోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, కోలిండియా విజేత కాసిపాక రాజమౌళి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సుమారు 200 మంది కళాకారులు ఒకే వేదికపై జానపద పాటలు, శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించి అబ్బురపరిచారు. సంస్థ ప్రధాన కార్యదర్శి, కోలిండియా కళాకారుడు సింగరేణి కార్మికుడు కనకం రమణయ్య ప్రాచీన జానపదాలకు జీవం పోస్తూ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. రాజమౌళి మాట్లాడుతూ పెద్దల నుంచి వారసత్వంగా కళలను పునికి పుచ్చుకొని కోల్ బెల్ట్ ప్రాంతంను కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా నిలుపుతున్న కళాకారుల కోసం స్థానికంగా ఆడిటోరియం నిర్మాణంకు పాలకులు కృషి చేయాలని కోరారు.
నిట్టూరి రాజారత్నం జానపద కళలను బతికించే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారని గుర్తు చేశారు. ఇలాంటి సమ్మేళనాలు మన సంప్రదాయాలను సజీవంగా ఉంచుతాయని పేర్కొన్నారు. ప్రముఖ కళాకారులు గుమ్మడి ఉజ్వల, ఆరెల్లి లక్ష్మీకళ, కనకం శంకర్, సమ్మయ్య, బానయ్య, రాజనర్సు, శ్రీనివాస్, వంశీ, సందీప్, జనగామ రాజనర్సు, దేవయ్య తదితరులను జానపద పురస్కారాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కళాకారులు వెంకట్రాజం, అట్ల జగ్గయ్య, జనగామ శ్రీనివాస్, రాజేశ్వరరావు, సిరిపురం శ్రీనివాస్, బీరుక లక్ష్మణ్, సోగాల వెంకటి, మాదరి శ్రీనివాస్, నాగుల శ్రీనివాస్, నరేశ్, రాజన్న, గాజుల రమేష్, వేముల అశోక్, సర్వేశ్, ధర్మేందర్, ప్రశాంత్, పద్మ తదితరులు పాల్గొన్నారు.

