epaper
Monday, March 2, 2026
epaper

తిరుమల లడ్డూ వ్యవహారం.. అసెంబ్లీలో చంద్రబాబు సంచలన విషయాలు

కలం, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్నది ముమ్మాటికి నిజమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu)  స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో మంగళవారం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించారు. సిట్ రిపోర్టులో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ స్పష్టంగా చెప్పినప్పటికీ వైసీపీ అధినేత జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మొదటి నుంచి తిరుమల విషయంలో వైసీపీ కుట్ర పూరితంగా అపచారం చేసిందని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి పద్ధతి ప్రకారం వెంకటేశ్వరస్వామి పవిత్రతను దెబ్బ తీశారని పేర్కొన్నారు. గతంలో బస్సు టికెట్ల వెనకాల కూడా క్రైస్తవ మత ప్రచారం చేశారని ఆరోపించారు. గతంలో పింక్ డైమండ్ పోయిందని 2018లో తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. పాలు లేకుండానే రసాయనాలతో నెయ్యి తయారు చేశారని సిట్ దర్యాప్తు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఇంత జరిగితే జగన్ క్షమాపణ చెప్పకుండా తమ మీద ఎదురుదాడికి దిగడం ఏమిటని ప్రశ్నించారు. తాను రిపోర్టుల ఆధారంగానే యానిమల్ ఫ్యాట్ ఉందన్న ఆరోపణలు చేశానని గుర్తు చేశారు.

తప్పు ఒప్పుకోకుండా బుకాయిస్తారా?

జగన్ హాయాంలో టీటీడీనీ రాజకీయ పునరావాసం కోసం వాడుకున్నారని ఫైర్ అయ్యారు. టీటీడీకి జంబో బోర్డు వేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కోర్టు ఈ నిర్ణయాన్ని తప్పు పడితే అప్పుడు విత్ డ్రా చేసుకున్నారని గుర్తు చేశారు. తిరుమల విషయంలో జగన్ ఏ మాత్రం భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా వ్యవహరించారని ఆరోపించారు. దేవుడు ఉన్నాడు గనకే తమకు ఈ స్థాయిలో మెజార్టీ వచ్చిందని పేర్కొన్నారు. ఎన్డీడీబీ రిపోర్టులో కల్తీ జరిగిందని స్పష్టంగా చెప్పినా వైసీపీ నేతలు బుకాయిస్తున్నారని పేర్కొన్నారు. పరకామణిలో చోరీ జరిగినా దాన్ని తక్కువ చేశారని ఫైర్ అయ్యారు. అది చాలా చిన్న నేరం అని జగన్ వాదిస్తున్నారని మండిపడ్డారు. వెంకటేశ్వరస్వామి తమ ఇంటి కులదైవం అని చంద్రబాబు అని పేర్కొన్నారు. వెంకటేశ్వరస్వామి గుడికి నమ్మకం ఉంటే ఏ మతస్థుడైనా రావొచ్చని.. కానీ జగన్ మాత్రం డిక్లరేషన్ ఇవ్వకుండా వచ్చారని ఆరోపించారు.

కల్తీపై తలోమాట

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తప్పు జరిగిందని ఒప్పుకున్నా జగన్ మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. మొత్తం 2032 ఆలయాలపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 59 విగ్రహాలు చోరీ అయ్యాయని ఆరోపించారు. వీటి విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. అంతర్వేది, రామతీర్థంలో జరిగిన ఘటనలపై కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు.

రిపోర్ట్ వచ్చినా తొక్కిపట్టారు

గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డుకు సంబంధించి కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చినా అప్పటి టీటీడీ బోర్డు తొక్కిపట్టిందని పేర్కొన్నారు. తాను ఈ విషయంలో సిద్ధాంతపరంగా పోరాడుతున్నానని చెప్పారు. బ్రిటీష్ పాలనలో కూడా వెంకటేశ్వరస్వామి జోలికి ఎవరూ రాలేదని పేర్కొన్నారు. తిరుమల విషయంలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. రిపోర్టులు చూసిన తర్వాతే తాను యానిమల్ ఫ్యాట్ గురించి మాట్లాడానని పేర్కొన్నారు. రోజుకు 4 లక్షల లీటర్ల కొనుగోలు చేయాలన్న నిబంధన ఉన్నా దాన్ని తొక్కిపట్టారని పేర్కొన్నారు. నెయ్యి ఉత్పత్తిలో అనుభవాన్ని 3 ఏండ్ల నుంచి ఏడాదికి కుదించారని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!