కలం, వెబ్ డెస్క్: న్యూస్ చానెళ్ల టీఆర్‌పీ రేటింగ్స్‌పై(TRP Ratings) కేంద్ర సమాచార ప్రసార శాఖ నాలుగు వారాల నిషేధం విధించింది. ఈ మేరకు టెలివిజన్ రేటింగ్ సంస్థ అయిన బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(BARC) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వెంటనే వార్తా ఛానళ్ల టీఆర్‌పీ డేటా ప్రచురణను నిలిపివేయాలని పేర్కొంది.
పశ్చిమాసియా యుద్ధంపై వార్తా చానెళ్ల వస్తున్న సంచలనాత్మక కథనాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని వార్తా ఛానెళ్లు అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఊహాగానాలు, అతిశయోక్తి కలిగిన కంటెంట్ ప్రసారం చేస్తున్నట్లు గమనించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలాంటి ప్రసారాలు ప్రజల్లో భయాందోళనలు కలిగించే అవకాశముందని పేర్కొంది. ముఖ్యంగా యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో బంధువులు లేదా పరిచయస్థులు ఉన్నవాళ్లలో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.ఈ నేపథ్యంలో ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని యుద్ధానికి సంబంధించిన వార్తల ప్రసారాల్లో ఇలాంటి కంటెంట్‌ను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు బార్క్‌కు పంపిన లేఖలో వెల్లడించింది.
టెలివిజన్ రేటింగ్ ఏజెన్సీలకు (TRP Ratings) సంబంధించిన 2014 విధాన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, నియమాలు, ఆదేశాలను రేటింగ్ సంస్థలు తప్పనిసరిగా పాటించాలనే క్లాజ్ 24.2ను మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం టీఆర్‌పీ రేటింగ్స్ నాలుగు వారాల పాటు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేస్తారు. ఈ నిర్ణయంతో న్యూస్ చానెళ్ల మధ్య ప్రతి వారం జరిగే టీఆర్‌పీ పోటీ తాత్కాలికంగా ఆగే అవకాశం ఉంది.

