కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)కు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. రెండో దశ నిర్మాణానికి అందించాల్సిన రుణంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులెత్తేశారు. దాని గురించి తనకు తెలియదని.. రుణ అంశం తన పరిధిలోనే లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి ఇండియన్ రైల్వే ఫైనాన్సింగ్ కార్పొరేషన్ (IRFC) ద్వారా రుణాలు సేకరించాలనే ప్రతిపాదన తమ వద్ద లేదని కుండబద్దలు కొట్టారు.
దీంతో తెలంగాణ ప్రభుత్వం కొద్ది నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు విఫలమైనట్లే కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించారు. త్వరలోనే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తాజాగా కేంద్ర మంత్రి ప్రకటన మాత్రం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
రూ.13 వేల కోట్ల రుణం కావాలని..
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్టును ఎల్అండ్టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రూ.13,600 కోట్లను IRFC ద్వారా తీసుకోవాలని సీఎం రేవంత్ భావించారు. గత మే నెలలోనే ఇందుకు సంబంధించిన ఒప్పందం కూడా జరిగింది. కానీ, నిధుల విడుదలలో ఆలస్యం జరుగుతూ వస్తోంది. ఈ రుణం మంజూరైతే మెట్రో రైల్ పూర్తిగా ప్రభుత్వం చేతికి రావడంతో పాటు రుణాలను రీఫైనాన్స్ చేసుకుని వడ్డీ కూడా తగ్గించుకునే అవకాశం ఉంది. అయితే, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాత్రం రుణం గురించి తనకు తెలియదని చెప్పడంతో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ అనుమతులు కూడా ఇంకా రావాల్సి ఉంది.

